Chandrababu Praja Galam Meeting :పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ ఫొటో ఎందుకంటూ జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకం నకలును చంద్రబాబు చించిపారేశారు. ప్రతిపక్ష నేతగా ముద్దులు పెట్టిన జగన్, ఇప్పుడు పిడిగుద్దులు కురిపిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొని ప్రసంగించారు. ఏం చేశారో, ఏం చేస్తారో జగన్ చెప్పుకోలేపోతున్నారని చంద్రబాబు విమర్శించారు. తాను సంక్షేమ పథకాలు ఇవ్వలేదని జగన్ అంటున్నారని, బడ్జెట్‌లో 19 శాతం సంక్షేమానికి ఖర్చు పెట్టానని తెలిపారు. జగన్ బడ్జెట్‌లో 10 శాతం మాత్రమే సంక్షేమానికి ఖర్చు పెట్టారని తెలిపారు.
Chandrababu Fires On YS Jagan :రక్తం పీల్చే జలగ జగన్ అని, తాను రక్తం ఇచ్చే రకమని చంద్రబాబు పేర్కొన్నారు. వైసీపీవి నవరత్నాలు అంటున్నారని అందులో మెుదటి నవరత్నం ఇసుక మాఫియా అని, జగన్ ఇచ్చిన రెండో నవరత్నం జే బ్రాండ్ మద్యం అని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత జే బ్రాండ్ మద్యం నిషేధించి మంచి మద్యాన్ని తక్కువకు ఇస్తామని హామీ ఇచ్చారు. జగన్ మూడో నవరత్నం భూ మాఫియా, నాలుగోతర్నం మైనింగ్ మాఫియా, ఐదోతర్నం హత్యారాజకీయాలు, ఆరోరత్నం ప్రజల ఆస్తులు కబ్జా చేయడం, ఏడోరత్నం ఎర్రచందనం, గంజాయి, ఎనిమిదోరత్నం దాడులు, అక్రమ కేసులు, తొమ్మిదో రత్నం శవరాజకీయాలు అని ధ్వజమెత్తారు.
పాసుపుస్తకాన్ని చించిపారేయాలి :పట్టాదారు పాసుపుస్తకంపై జగన్ ఫొటో ఎందుకు అని, జగన్ ఫొటో ఉన్న పాసుపుస్తకాన్ని చించిపారేయాలని పిలుపునిచ్చారు. ప్రజల భూములను జగన్ దగ్గర పెట్టుకుంటారంటా, ప్రజల భూమి రికార్డులను ప్రైవేటు సంస్థకు ఇచ్చారని ఆరోపించారు. ప్రజల భూమి సైకో జగన్ గుప్పిట్లో ఉందన్న చంద్రబాబు, మీ భూమిపై మీకు హక్కు ఉందా అని ప్రశ్నించారు. భూమి మీది అని,పెత్తనం జలగది అని విమర్శించారు. సైకో జగన్ అందరి మెడలకు ఉరితాడు వేశారన్న చంద్రబాబు, జగన్ ఎప్పుడు లాగితే అప్పుడు మీ ప్రాణం పోతుందని అన్నారు. మీ భూమిని మీకు ఇప్పించే బాధ్యత తనదని చంద్రబాబు తెలిపారు.
Chandrababu Comments On Avinash Reddy :అవినాష్‌రెడ్డి చిన్నపిల్లాడంటా, అవినాష్ చిన్నపిల్లాడైతే పలకా బలపం ఇచ్చి స్కూలుకు పంపించాలని ఎద్దేవా చేశారు. స్కూలుకు పంపాల్సిన పిల్లాడిని పార్లమెంటుకు జగన్ పంపించారని అన్నారు. మన మ్యానిఫెస్టో కళకళలాడుతుందని, జగన్ మ్యానిఫెస్టో విలవిలలాడుతుందని మండిపడ్డారు. పింఛన్ రూ.2 వేలకు పెంచింది ఎవరు అని ప్రశ్నించిన చంద్రబాబు, జగన్ పేదల వ్యతిరేకి అని, పేదలను చంపి ఓట్లు పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ ఇచ్చే బాధ్యత తనదని, పెంచిన పింఛన్ ఏప్రిల్ నుంచే ఇస్తామని స్పష్టం చేశారు.