Chandrababu Naidu Comments :అయ్యన్నపాత్రుడు ఎప్పటికీ ఫైర్ర్ బ్రాండేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. అంకిత భావం విషయంలో అయ్యన్న కరుడుగట్టిన పసుపు సైనికుడని ఆయన ప్రశంసించారు. పార్టీని కన్నతల్లిగా భావిస్తూ 43 ఏళ్లుగా నిక్కచ్చిగా రాజకీయాలు చేశారన్నారు. మచ్చలేని అయ్యన్నపాత్రుడుపై గత 5 ఏళ్లలో అత్యాచారం సహా పదుల సంఖ్యలో అక్రమ కేసులు పెట్టారన్న చంద్రబాబు, దేనికీ భయపడకుండా ధైర్యంగా పోరాడి ప్రజల్లో గెలిచి అసెంబ్లీకి వచ్చారని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారు : అత్యంత సీనియర్ సభ్యుల్లో అయ్యన్న ఒకరన్న చంద్రబాబు, అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని ఆనాడు ఎన్టీఆర్ పిలుపునిచ్చారని, ఎన్టీఆర్ పిలుపుతో 25 ఏళ్ల వయస్సులో అయ్యన్న రాజకీయాల్లోకి వచ్చారని గుర్తు చేశారు. 7 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఎన్నికయ్యారని, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ముద్ర వేశారని తెలిపారు. ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వన్నెతెచ్చిన వ్యక్తి అయ్యన్న అని చంద్రబాబు కొనియాడారు.
66 ఏళ్ల వయస్సు ఉన్నా ఇప్పటికీ ఫైర్ బ్రాండే :1983 నుంచి ఇప్పటివరకు పది సార్లు పోటీచేశారని, 66 ఏళ్ల వయస్సు ఉన్నా ఇప్పటికీ ఫైర్ బ్రాండే అని అన్నారు. నీతి, నిజాయతీ, నిబద్ధతను పుణికిపుచ్చుకొని రాజకీయాలు చేశారన్న చంద్రబాబు, ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న నాయకుడని పేర్కొన్నారు. గత ఐదేళ్లుగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని, అనేక పోలీసుస్టేషన్లలో కేసులు పెట్టి వేధించారన్నారు. 23 కేసులు పెట్టినా రాజీలేని పోరాటం చేశారన్నారు.
అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బందిపెట్టారు : చట్టసభకు రావడం అరుదైన గౌరవమన్న చంద్రబాబు, మనందరిపై పవిత్ర బాధ్యత ఉందని గుర్తుంచుకోవాలన్నారు. సమర్థంగా పనిచేస్తే గౌరవం దానంతట అదే వస్తుందని, ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందన్నారు. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బందిపెట్టారని, తన కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు మైకు ఇవ్వకుండా చేసి అవమానపరిచారని పేర్కొన్నారు.
గౌరవ శాసనసభను గత ప్రభుత్వం అగౌరవ పరిచిందని ఆరోపించారు. బూతులు తిట్టేందుకు, వ్యక్తిత్వ హననం, అవమానాలు, దాడులకు వేదికగా నాటి సభ నిలిచిందని మండిపడ్డారు. తనను, తన కుటుంబసభ్యుల్ని ఎంతో అవమానించినా కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని విమర్శించారు. అందుకే మళ్లీ ముఖ్యమంత్రిగా గౌరవ సభకు వస్తానని శపథం చేసి బయటకు వెళ్లిపోయానని గుర్తుచేశారు. స్పీకర్ కు అభినందన తీర్మానంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. నాటి శాసనసభలో ఆడబిడ్డల వ్యక్తిత్వ హననం ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టారని, ప్రజలు అంతా గమనించి తనను గౌరవ సభకు పంపారన్నారు.