Case Filed Against MLA Arekapudi Gandhi and Corporators :శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీపై హత్యాయత్నం కేసు నమోదైంది. గాంధీతో పాటు అతని కుమారుడు, సోదరుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. కార్పొరేటర్లు వెంకటేశ్‌గౌడ్, శ్రీకాంత్‌ను నిందితులుగా చేర్చారు. గచ్చిబౌలి పీఎస్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు.
సవాల్‌తో మొదలై అరెస్టు దాకా :కాగా రాష్ట్ర ప్రజాపద్దుల సంఘం ఛైర్మన్‌గా అరెకపూడి గాంధీని నియమించిన అనంతరం పరిణామాలు ఒక్కసారిగా రాజకీయాలను వేడెక్కించాయి. తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని ప్రకటించిన గాంధీకి, గులాబీ కండువా కప్పుతానన్న కౌశిక్ రెడ్డి సవాల్‌తో మొదలైన పంచాయితీ ఉద్రిక్తతలకు దారి తీసింది. కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడం, ఆయన అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటి అద్దాలు, కుండీలు ధ్వంసం చేయడం అరెస్టులకు దారితీసింది.