Telangana Sub Committee Meeting On Rythu Bharosa :రైతు భరోసాపై మంత్రివర్గానికి చేయాల్సిన సిఫార్సులపై చర్చించేందుకు కేబినెట్ సబ్‌కమిటీ గురువారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సాగు చేసే రైతన్నలందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది. రైతు భరోసాకు ఐటీ(ఆదాయపు పన్ను) చెల్లింపు, భూమి పరిమితి పెట్టవద్దని మంత్రి వర్గ ఉపసంఘం అభిప్రాయపడింది.
జనవరి 5 నుంచి దరఖాస్తులు స్వీకరించే ఛాన్స్ :రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అధికారుల సర్వే, శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సాగు భూములను గుర్తించే ప్రక్రియ చేపట్టనున్నారు. జనవరి 5 నుంచి 7 వరకు రైతుభరోసా దరఖాస్తులు తీసుకునే అవకాశముంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసాను చెల్లిస్తామన్న సర్కారు నాలుగో తేదీన జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌బాబులు సభ్యులుగా ఏర్పాటైన ఉపసంఘం ఇప్పటికే పలు దఫాలుగా సమావేశమై పలు అంశాలపై చర్చించింది.
అందరూ ఆదాయం వచ్చే పంటలు వేయాలని సూచన :మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యకర్తలను ఉద్దేశించి టెలిఫోన్లో ప్రసంగించారు. ఇప్పటికే రూ.30 వేల కోట్లు వ్యవసాయం, రైతు సంక్షేమం కోసం కేటాయించమని మంత్రి తుమ్మల ఫోన్ ప్రసంగంలో తెలిపారు. గురువారం కేబినెట్ సబ్‌కమిటీలో రైతు భరోసాపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అందరూ ఆదాయం వచ్చే పంటలు వేయాలని సూచించారు. హుస్నాబాద్, కోహెడ, సైదాపూర్ మార్కెట్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తానని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.