తెలంగాణ

telangana

త్వరలోనే తెల్ల రేషన్ కార్డుల పంపిణీ - విధివిధానాల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ - TELANGANA CABINET MEETING

By ETV Bharat Telangana Team

Published : Aug 1, 2024, 4:01 PM IST

Updated : Aug 1, 2024, 6:37 PM IST

Telangana Cabinet Meeting : తెలంగాణ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై ప్రధానంగా చర్చించిన అమాత్యులు, రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయించారు.

Cabinet Meeting
Telangana Cabinet Meeting (ETV Bharat)

TG Cabinet Meeting: సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన అమాత్యులు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి ఉత్తమ్‌ అధ్యక్షతన ఏర్పాటు కానున్న ఈ సబ్‌ కమిటీ రేషన్ కార్డుల జారీకి సంబంధించి విధి విధానాలను రూపొందించనుంది. ఈ క్రమంలోనే రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులు విడిగా ఇవ్వాలని కేబినెట్‌లో నిర్ణయించారు.

జీహెచ్‌ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి సైతం కేబినెట్ సబ్‌ కమిటీని ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ విలీన కమిటీలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, సీతక్క, శ్రీధర్ బాబు సభ్యులుగా ఉంటారు. దీంతో పాటు గౌరవెల్లి ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గౌరవెల్లి ప్రాజెక్ట్ పెండింగ్ పనుల పూర్తి కోసం రూ.437 కోట్ల విడుదలకు పచ్చజెండా ఊపింది. గౌరవెల్లి ప్రాజెక్టుకు నిధుల కోసం చొరవ తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్, కేబినెట్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.

కొత్త రేషన్‌ కార్డులకు త్వరలోనే మోక్షం : కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై మంత్రివర్గంలో సుదీర్ఘంగా చర్చించారు. 6 గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు తెల్లరేషన్ కార్డునే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్‌ కార్డుల కోసం ప్రజల నుంచి డిమాండ్ ఏర్పడింది. అర్హులందరికీ తెల్ల రేషన్‌ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అసెంబ్లీలో 2 రోజుల క్రితం ప్రకటించారు. ఈ మేరకు రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధి విధానాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. అనంతరం కొత్త రేషన్ కార్డుల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

సమావేశం అనంతరం కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, 'ఎన్నికల మేనిఫెస్టోలోని అంశాలను తప్పక నెరవేరుస్తాం. త్వరలో పేదలకు తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తాం. పేదలకు విడివిడిగా తెల్లరేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తాం. రేషన్‌ కార్డుల జారీ విధి విధానాల కోసం కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు జరిగింది. క్రీడాకారులు ఈషా సింగ్‌, నిఖత్‌ జరీన్‌, సిరాజ్‌కు 600 గజాల చొప్పున ఇంటి స్థలం ఇవ్వాలని నిర్ణయించాం. విధుల్లో చనిపోయిన రాజీవ్‌ రతన్‌ కుమారుడికి మున్సిపల్‌ కమిషనర్‌ ఉద్యోగం, మరో అధికారి మురళి కుమారుడికి గ్రూప్‌- 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించాం' అని వెల్లడించారు.

Last Updated : Aug 1, 2024, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details