KTR Comments On BRS Workers :గెలుపు ఓటములతో నిమిత్తం లేకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కనబరిచిన కదనోత్సాహం రాష్ట్ర స్థాయిలో పని చేసే నాయకత్వంలో కూడా కొండంత స్ఫూర్తి నింపిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. 'ప్రాణ సమానులైన బీఆర్ఎస్ తోబుట్టువుల్లారా' అంటూ 'ఎక్స్' వేదికగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఆయన గత ఏడాది కాలంగా కాంగ్రెస్ నిరంకుశ పాలనపై కనబరిచిన పోరాట స్ఫూర్తికి శిరస్సు వంచి సలాం చేస్తున్నట్లు తన పోస్టులో పేర్కొన్నారు.
ప్రజల పక్షాన విరామం ఎరగని పోరాటం :గులాబీ సైనికులు రాష్ట్ర ప్రజల పక్షాన విరామం ఎరుగని పోరాటం చేస్తున్నారని, ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీల గారడీని ప్రజాక్షేత్రంలో ఎండగట్టారని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడును అడుగుడుగునా ప్రతిధ్వనించారని కొనియాడారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు చేసిన పోరాటాలను చరిత్రపై చెరగని సంతకాలుగా కేటీఆర్ అభివర్ణించారు.
కార్యకర్తల పోరాటాల వల్లే సర్కారు వెనక్కి తగ్గింది :తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను అత్యంత సమర్థంగా తిప్పికొట్టిన సందర్భాలు పోరాటపథంలో నిలిచి ఉండే మైలురాళ్లు అని కేటీఆర్ అన్నారు. తెలంగాణ ప్రజల కోసం గల్లీ నుంచి దిల్లీ వరకు బీఆర్ఎస్ శ్రేణులు మోగించిన “జంగ్ సైరన్” ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టించిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నేతలు, కార్యకర్తల అలుపెరగని పోరాటాల వల్లే అదానీ విరాళం, లగచర్ల లడాయిలో సర్కార్ వెనక్కు తగ్గిందని కేటీఆర్ తెలిపారు. అక్రమ కేసులు పెట్టినా వేధించాలని చూసినా మొక్కవోని ధైర్యంతో నిలబడ్డ తీరు అపూర్వమని బీఆర్ఎస్ శ్రేణులను ప్రశంసించారు.