Assembly 3rd Day Session : లగచర్ల ఘటన, రైతుకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన రెండో రోజూ కొనసాగింది. శాసనసభకు నల్లదుస్తులు, బేడీలతో వచ్చిన ప్రజాప్రతినిధులు శాసనసభలో నిరసన తెలిపారు. స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లుపై చర్చను ప్రారంభించగా లగచర్లపై చర్చించాలని ఆందోళన చేశారు. నినాదాలతో హోరెత్తించారు. బీఆర్ఎస్ సభ్యుల వైఖరిని ఖండించిన మంత్రులు శ్రీధర్‌బాబు, సీతక్క, విప్ ఆదిశ్రీనివాస్ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు బేడీలు వేసింది మీరేనంటూ ఎదురుదాడికి దిగారు.
వికారాబాద్ జిల్లా లగచర్ల రైతుకు బేడీలు వేసి అవమానించారంటూ శాసనసభ వేదికగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. సోమవారమే లగచర్ల అంశంపై చర్చకు శాసనసభలో బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టారు. లగచర్ల రైతులకు సంఘీభావంగా నల్ల రంగు దుస్తులు, బేడీలు ధరించి సభలకు హాజరైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు రైతులను జైలు నుంచి వెంటనే విడుదల చేయాలని నిరసన తెలిపారు. ప్రభుత్వం రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
లగచర్ల అంశంపై పట్టు : ప్రశ్నోత్తరాల తర్వాత విరామం అనంతరం ప్రారంభమైన శాసనసభలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లుపై చర్చను చేపట్టగా బీఆర్ఎస్ శాసనసభ్యులు లగచర్ల, గుండెనొప్పి వచ్చిన రైతుకు బేడీలు వేసిన అంశంపై చర్చకు పట్టుపట్టారు. నినాదాలతో హోరెత్తించారు. రైతులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ సభ్యుల నినాదాల మధ్యే మూడు బిల్లులకు ఆమోదం తెలిపిన శాసనసభ పర్యాటక విధానంపై చర్చను ముగించింది.