BRS Protest Against LRS in Telangana 2024 :లే అవుట్ల క్రమబద్ధీకరణ - ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారత్ రాష్ట్ర సమితి ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. కాంగ్రెస్ నేతలు గతంలో చెప్పినట్లుగా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) చేయాలని గులాబీ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాకు దిగనుంది.
BRS Leaders Protest Seeking Free LRS :ఎన్నికలకు ముందు ఉచితంగా ఎల్ఆర్ఎస్ అమలు చేస్తామన్న వ్యాఖ్యలకు విరుద్ధంగా చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిరసనలకు పార్టీ పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఇవాళ ధర్నా కార్యక్రమాలు చేపట్టనుంది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జీహెచ్ఎమ్సీ, హెచ్ఎమ్డీఏ కార్యాలయాల(HMDA Office) వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, నేతలు నిరసనల్లో పాల్గొంటారు. రేపు అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు, ఆర్డీఓలకు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించారు.
ఎల్ఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల కేంద్రాల్లో బీఆర్ఎస్ ధర్నాలు (BRS Dharna Against LRS) నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రజలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని ఆరోపించారు. ఎన్నికల్లో గెలవడానికి అడ్డమైన హామీలు ఇచ్చి, ఆ పార్టీ ప్రజలను గందరగోళం చేసిందని విమర్శించారు.