తెలంగాణ

telangana

ప్రచార జోరును పెంచిన గులాబీ నేతలు - ఊరూవాడా తిరుగుతూ విపక్షాలపై విమర్శలు - BRS Leaders Campaign 2024

BRS MP Candidates Election Campaign : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్‌ మెడలు వంచి గ్యారంటీలను అమలు చేయిస్తామని గులాబీ నేతలు వెల్లడించారు. పదేళ్లలో బీజేపీ ప్రభుత్వం పేదలను కొట్టి అంబానీ, అదానీ వంటి పెద్దలకు పెట్టిందని విమర్శించారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్‌ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటూ దుయ్యబట్టారు. లోక్‌సభ ఎన్నికల వేళ ప్రచార జోరు పెంచిన గులాబీ దళం ఊరూవాడా తిరుగుతూ విపక్షాలపై విమర్శలు గుప్పిస్తోంది.

By ETV Bharat Telangana Team

Published : May 4, 2024, 7:55 AM IST

Published : May 4, 2024, 7:55 AM IST

BRS Leaders Election Campaign
BRS MP Candidates Election Campaign (Etv Bharat)

ప్రచార జోరును పెంచిన గులాబీ నేతలు అత్యధిక స్థానాలే లక్ష్యం (Etv Bharat)

BRS Leaders Election Campaign :ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన బీఆర్ఎస్ సార్వత్రిక పోరులో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో రోడ్‌షోలు, కార్నర్‌ మీటింగ్‌లతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఓ వైపు గులాబీ దళపతి బస్సుయాత్రలతో రాష్ట్రమంతా చుట్టేస్తుండగా అభ్యర్థులు సైతం విపక్షాలను విమర్శిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ సర్కార్‌ ప్రపంచంలోని అన్ని దేశాల కంటే పెట్రోల్‌, డీజీల్‌ ధరలు పెంచి పేదలను ఇబ్బంది పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. సికింద్రాబాద్‌ అభ్యర్థి పద్మారావుకు మద్దతుగా రోడ్‌షో నిర్వహించిన కేటీఆర్​ కేంద్ర మంత్రిగా కిషన్‌రెడ్డి రాష్ట్రానికి ఏమీ చేయలేదని ధ్వజమెత్తారు. స్కూటీలు సహా గ్యారంటీలు అటకెక్కినా కాంగ్రెస్‌ లూటీ మాత్రం ప్రారంభమైందని ఆరోపించారు.

Harish Rao Election Campaign :బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపిస్తే కాంగ్రెస్‌ మెడలు వంచి గ్యారంటీలు అమలు చేయిస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. నల్గొండ, భువనగిరి అభ్యర్థులు కంచర్ల కృష్ణారెడ్డి, క్యామ మల్లేశ్‌కు మద్దతుగా చండూరు, నల్గొండలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి రాగానే రూ .2 లక్షల ఉద్యోగాలిస్తామన్న రేవంత్‌ సర్కార్‌ ఒక్క నోటిఫికేషన్‌ ఇవ్వలేదని మండిపడ్డారు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబాలకు మాత్రం రెండేసి ఉద్యోగాలిచ్చారని ధ్వజమెత్తారు. ఐదు నెలల్లోనే వద్దురో నాయనా కాంగ్రెస్‌ పాలనా అంటూ ప్రజలు మొత్తుకుంటున్నారని హరీశ్‌ రావు విమర్శించారు.

"నాలుగు వేలు ఎవరికైనా వచ్చాయా? తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చాయా? అవి రాలేదు కానీ కాంగ్రెస్​ వాళ్ల లూటీలు మాత్రం మొదలయ్యాయి. ఒకే ఓటుతో బడా భాయి, చోటా భాయికి బుద్ధి చెప్పే అవకాశం వచ్చింది. 2014లో బడా భాయ్ చాలా అబద్ధపు హమీలు ఇచ్చారు."- కేటీఆర్, బీఆర్ఎస్​ కార్యనిర్వాహక అధ్యక్షుడు

బీఆర్​ఎస్​కు 10 నుంచి 12 లోక్​సభ సీట్లు ఇస్తే - కేసీఆర్​ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు : కేటీఆర్ - KTR Road Show at Secunderabad

ఆరు గ్యారంటీలతో మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ లోక్‌సభ ఎన్నికలకు ప్రత్యేక హామీలతో ప్రజల్లో భ్రమలు సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ నేత గట్టు రామచందర్‌ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులను కొనుగోలు చేస్తూ కాంగ్రెస్‌ చిల్లర రాజకీయాలకు తెరలేపిందని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఇంఛార్జీ రావుల శ్రీధర్‌ ఆరోపించారు. కష్టకాలంలో అండగా నిలవాల్సిన కాంగ్రెస్‌ నేతలు వేధింపులకు దిగడం బాధాకరమని అభ్యర్థి నివేదిత ఆవేదన వెలిబుచ్చారు. మెదక్‌ జిల్లా అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా కౌడిపల్లి, కొల్చారంలో మాజీ అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ప్రచారం నిర్వహించారు

Lok Sabha Polls Campaign :దేశంలో ఉండే అన్ని పదవులు కడియం శ్రీహరికి ఇచ్చినా మోసపోవడం కేసీఆర్​ వంతైందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా జఫర్‌గడ్‌లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కడియం శ్రీహరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చోటాభాయ్‌, బడా భాయ్‌లు ఇద్దరూ ఒకటేనని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్‌కు మద్దతుగా తుంగతుర్తిలోని ఎన్నికల సన్నాహక భేటిలో కాంగ్రెస్‌, బీజేపీలపై ధ్వజమెత్తారు. ప్రలోభాలకు లొంగకుండా లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించాలని నాగర్‌కర్నూల్‌ అభ్యర్థి ఆర్​ఎస్​ ప్రవీణ్‌ కుమార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అబద్ధాలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి: హరీశ్‌రావు - HARISH RAO SLAMS CM REVANTH

కాంగ్రెస్‌ అరిచేతిలో వైకుంఠం చూపించి - ఆరు గ్యారంటీలతో దగా చేసింది : కేసీఆర్ - KCR Bus Yatra in Mahabubabad

ABOUT THE AUTHOR

...view details