BRS MLA Sabitha Indra Reddy Comments on CM Revanth Reddy : శాసనసభలో తాను కనిపిస్తేనే సీఎం రేవంత్ రెడ్డికి కంటగింపుగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని 4 గంటలు నిలబడినా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి తమపై చేసిన కామెంట్స్‌పై వారు తీవ్రంగా స్పందించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, మేం ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశామని అన్నారు. వారు మహిళలకు అవకాశం ఇవ్వాలని అన్నారని గుర్తు చేశారు. వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ మహిళలకు సభలో ఎంతో గౌరవం ఇచ్చేవారని కొనియాడారు. కానీ సీఎం రేవంత్ రెడ్డికి మాత్రం తాను సభలో కనిపిస్తేనే కంటగింపుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
'కేసీఆర్‌ను తిట్టేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఉంది. సభలో 9 మంది మహిళా సభ్యులుంటే మాట్లాడే అవకాశమే రావట్లేదు. చట్టసభల్లోనూ మహిళల పట్ల వివక్ష చూపటం సరికాదు. ఎస్సీ వర్గీకరణపై మాట్లాడుదామనుకుంటే మైకు ఇవ్వలేదు. మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. పార్టీ మారటం పెద్ద నేరం అయితే ఇప్పుడు కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరలేదా?. నా వల్ల సీఎల్పీ పదవి పోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇప్పుడు ఎస్సీ నేతకు సీఎం పదవి ఇవ్వాలని ఆయన ఎందుకు అడగలేదు.' అని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు.