BRS MLA Jagadish Reddy on Telangana Electricity : విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన విద్యుత్ దక్కలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు. సీలేరు విద్యుత్ ప్లాంట్ కోసం 7 మండలాలను ఏపీలో కలుపుతున్నారన్నారు. ప్రైవేటు కంపెనీల నుంచి కూడా విద్యుత్ కొనకుండా తెలంగాణపై కుట్రలు చేశారని విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్‌కు తనకు తెలిసిన సమాచారాన్ని పంపామని, గత ప్రభుత్వంపై అర్థం లేని రాజకీయ ఆరోపణలు కొందరు చేశారని వాటికి సమాధానం చెప్పాలని బీఆర్‌ఎస్ నేత జగదీశ్ రెడ్డి తెలిపారు. కమిషన్ చేసిన వ్యాఖ్యలపై కూడా తన అభిప్రాయాన్ని తెలిపానని అన్నారు. కొందరు కుహన మేధావులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని విమర్శించారు. కేసీఆర్, అప్పటి ప్రభుత్వంపై బురద జల్లుదామని, అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు చేసే కుట్ర అది అని ధ్వజమెత్తారు.
ఛత్తీస్‌గఢ్ నుంచి ఎక్కువ ధరకు కాకుండా రూ.3.90కి యూనిట్ కరెంటు కొంటే నష్టం ఎలా అవుతుందని ప్రశ్నించారు. కమిషన్ దృష్టికి ఈ అంశాలను తీసుకెళ్లానని తెలిపారు. రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో విద్యుత్ విషయంలో పక్క రాష్ట్రం ఎన్నో కుట్రలు చేసిందని చెప్పారు. ఏ మాత్రం ఆలస్యం జరిగినా పీజీసీఎల్ లైన్‌ను కూడా పక్క రాష్ట్రం బుక్ చేసుకునేదని వివరించారు. బాధ్యల లేకుండా, రాష్ట్ర అభివృద్ధి పట్ల సోయ లేని కొంత మంది నాకు సమైక్యవాదుల ఏజెంట్లుగా ఉన్నవారు అనవసర ఆరోపణలు చేశారన్నారు.
ఛత్తీస్‌గఢ్ నుంచి యూనిట్ కరెంటును రూ.3.90కి కొన్న సమయంలో సింహాద్రి నుంచి రూ.4.33కు కొన్నామని బీఆర్‌ఎస్ నేత జగదీశ్ రెడ్డి తెలిపారు. ఆ సమయంలో దక్షిణాదిన ఎవరూ కూడా రూ.3.90 కంటే తక్కువగా ఎవరూ కొనలేదని అన్నారు. నవరత్నాల్లో ఒకటైన బీహెచ్‌ఈఎల్‌కు పనులు అప్పగించామన్నారు. సబ్ క్రిటికల్ టెక్నాలజీపై చర్చ అర్థరహితమని అన్నారు. 48 నెలల్లోనే కొత్తగూడెం ప్లాంటు నిర్మాణం పూర్తి చేయడం దేశంలోనే రికార్డు, అదే ఆర్టీపీపీ ఎప్పుడో చేపట్టినా మొన్న పూర్తి చేశారని వివరించారు.