BRS Leaders On Farmers Suicides in Telangana :రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, ఆత్మహత్యాయత్నాలు నిత్యకృత్యం అయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ఒక రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, తన సమస్యకు పరిష్కారం చూపడం లేదనే ఆవేదనతో బుధవారం సీఎం సొంత జిల్లాలోనే ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని అన్నారు. ఈ ఘటనలు మరువక ముందే ఖమ్మం కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యారని మాజీ మంత్రి పేర్కొన్నారు.
పురుగుల మందే రైతులకు పెరుగన్నం :రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, వారి సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ, పట్టెడన్నం పెట్టే రైతుల సంక్షేమం పట్ల లేదని మండిపడ్డారు. పురుగుల మందే రైతన్నలకు పెరుగన్నం అయ్యే దుర్భర పరిస్థితులను ఏడు నెలల కాంగ్రెస్ పాలన మళ్లీ తీసుకొచ్చిందని ఆక్షేపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, రైతుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బీఆర్ఎస్ పక్షాన హరీశ్ రావు డిమాండ్ చేశారు.
పంట నష్టపోయామని దంపతుల ఆత్మహత్యాయత్నం - భర్త మృతి, భార్య పరిస్థితి విషమం