BRS Leaders Arrest at Gandhi Hospital :రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య సేవలపై బీఆర్‌ఎస్ నియమించిన త్రిసభ్య కమిటీ గాంధీ ఆసుపత్రికి రానున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రి వద్దకు చేరుకున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సంజయ్, మాగంటి గోపీనాథ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
మాజీ ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ రాజయ్య అధ్యక్షతన ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌లతో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలపై బీఆర్‌ఎస్ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ముందుగానే బీఆర్‌ఎస్ నేతలు గాంధీ ఆసుపత్రికి వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు భద్రతను పెంచారు. ఆసుపత్రిలోకి బీఆర్‌ఎస్ నాయకులను రానివ్వకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
ముందుగా తెలంగాణ భవన్‌కు చేరుకున్న నేతల కమిటీ మాట్లాడుతూ, ఆసుపత్రులపై అధ్యయనం చేస్తామంటే ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని ప్రశ్నించారు. తమ నేతలు గాంధీ ఆసుపత్రికి వెళ్తామంటే భయమెందుకని అడిగారు. గాంధీ ఆసుపత్రిలో మాతాశిశు మరణాలను ప్రభుత్వం దాస్తుందా అని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఏమైనా బయటపడుతుందని భయపడుతున్నారా అంటూ నిలదీశారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు.
అరెస్టు చేయడం దారుణం : మాతాశిశు మరణాలు ఎందుకు పెరిగాయి అనే విషయం అడిగేందుకు వెళ్తే అరెస్టు చేయడం దారుణమని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆవేదన చెందారు. నిర్మాణాత్మకమైన అంశాలపైనే పోరాడుతున్నామన్నారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో కూర్చుని మాట్లాడాలని వస్తే అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సమస్య తెలుసుకోవాలని సీఎం అన్నారని ప్రతిపక్ష బాధ్యతగా అదే పని చేస్తున్నామని పేర్కొన్నారు. కానీ అక్రమ అరెస్టులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. గాంధీ ఆసుపత్రిలో ప్రొఫెసర్లు, సీనియర్లు, స్టాఫ్ కొరత ఉందని తెలిపారు.
కమిటీని ఎందుకు అడ్డుకున్నారు : మరోవైపు బీఆర్‌ఎస్ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులను అడ్డుకోవడంపై బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వైద్య, ఆరోగ్య పరిస్థితి అధ్యయనానికి నిపుణులైన ముగ్గురు వైద్యులతో నిజనిర్ధారణ కమిటీ వేశామని తెలిపారు. ఆ కమిటీని గాంధీ ఆసుపత్రికి వెళ్లకుండా ఎందుకు అడ్డుకున్నారంటూ ప్రశ్నించారు. వాస్తవాలను ప్రభుత్వం ఎందుకు దాస్తుందని ధ్వజమెత్తారు. సీఎం, కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా వాస్తవాలను దాచలేరన్నారు. వాస్తవ పరిస్థితిని బయటకు తీసుకొచ్చే వరకు పోరాటం ఆగదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులపై బీఆర్‌ఎస్ నిజనిర్ధారణ కమిటీ
గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై దాడి - నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు - Attack On Junior Doctor In Gandhi