BRS Leader Teegala Krishna Reddy Joins Congress :లోక్‌సభ ఎన్నికలకు ముందు గులాబీ పార్టీకి వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీ నేతలు ఒకరికొకరు పార్టీని వీడుతున్నారు. తాజాగా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వీరితోపాటు ఎంపీటీసీలు, సర్పంచులు కూడా రాజీనామా సమర్పించారు. ఈ నెల 27న చేవెళ్లలో జరగబోయే సభలో ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తీగల కృష్ణారెడ్డి వెల్లడించారు.
ప్రజాసంక్షేమం కోసం ఈ ప్రాంత ప్రజలకు సేవచేయాలని ఉద్దేశంతో స్వర్గీయ నందమూరి తారకరామారావు పిలుపు మేరకు 1983లో ప్రజా జీవితంలోకి వచ్చానని తీగల కృష్ణారెడ్డి తెలిపారు. గతంలో హుడా ఛైర్మన్గా, నగర మేయర్గా, ఎమ్మెల్యేగా పని చేసినట్లు చెప్పారు. 2014లో బీఆర్ఎస్లో చేరిన తాను పార్టీ ప్రతిష్ఠ కోసం పని చేశానని, కొంత కాలంగా పార్టీ విధేయులును, కార్యకర్తలను విస్మరిస్తుండడంతో కలత చెంది రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
Rangareddy ZP Chairperson Anita Joins Congress :అదే కోవలో రంగారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి కూడా తమ కార్యకర్తల మనోభావాలను ఏకీభవిస్తూ భారత్ రాష్ట్ర సమితి(BRS Party) ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలోనే తీగల కాంగ్రెస్‌లో చేరి, మహేశ్వరం నుంచి పోటీ చేస్తారని ప్రచారం ముమ్మరంగా జరిగింది. అయితే ఎమ్మెల్యే టికెట్ దక్కకపోవడంతో వెనక్కి తగ్గారు.