Tsunami 2004 Death Toll Photos : ఇండొనేషియాలోని సుమత్రా దీవుల్లో 2004 డిసెంబరు 26న 9.2 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. సునామీ అనే పెను విపత్తును ప్రపంచానికి పరిచయం చేసింది. భూకంపం ధాటికి సముద్రం పోటెత్తి, తీరప్రాంతాలను ముంచెత్తింది. కడలి అర కిలోమీటరుకుపైగా భూభాగంపైకి చొచ్చుకు రాగా, ఈ మహా ప్రళయానికి 14 దేశాల్లోని తీరప్రాంతాలు మరుభూములుగా మారాయి. 30 మీటర్ల ఎత్తు వరకూ ఎగసిపడిన రాకాసి అలలు 2లక్షల 30వేల మందిని మింగేశాయి. ఒక్క భారత్‌లోనే 16వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనే అత్యంత ఘోర విపత్తుగా మారిన ఈ సునామీ కారణంగా సర్వస్వం కోల్పోయిన వారికి లెక్కేలేదు.
5లక్షల మందికిపైగా!
ఇండొనేషియా నుంచి భారత్, శ్రీలంక, థాయ్‌లాండ్ సహా అనేక దేశాల్లో సముద్రతీరాల వెంబడి ఎటుచూసినా విధ్వంసమే కనిపించింది. సునామీ సంభవించిన ఇండొనేషియాలో లక్షా 70 వేల మందికిపైగా మృత్యు అలలకు బలయ్యారు. ఐదు లక్షల 70 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇండోనేషియాలోని అతే ప్రావిన్స్‌పై సునామీ పెను ప్రభావం చూపింది. 23 జిల్లాల్లో 18 తీరప్రాంతంలోనే ఉండగా సుమారు 85వేల మంది ప్రాణాలు కోల్పోయారు.
ఎన్నో మత్స్యకార కుటుంబాలు చిన్నాభిన్నం కాగా తమను రక్షించే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన తల్లిదండ్రులను తలచుకొని వారి పిల్లలు ఇప్పటికీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సముద్రంలోకి వేటకు వెళ్లినవారు, మృత్యు అలలకు బలికాగా, చివరిచూపు కూడా దక్కలేదని వారి కుటుంబాలు రోదిస్తున్నాయి. ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు పెద్దఎత్తున ముందుకొచ్చి కూడు, గూడుకు భరోసా కల్పించినప్పటికీ, ఆత్మీయులను కోల్పోయేలా చేసిన అలలు వారికి పీడకలలుగా మిగిలిపోయాయి. నాటి విపత్తును కళ్లారా చూసిన చిన్నారులు ప్రస్తుతం పెద్దవాళ్లు అయినప్పటికీ భవిష్యత్‌లో ఇలాంటి ఉపద్రవం మళ్లీ వస్తుందేమోనని ఉలిక్కిపడుతూనే ఉన్నారు.
ఏటా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు
సునామీకి ముందు పర్యటకులకు స్వర్గధామంగా ఉన్న సుమత్రా దీవులు, తర్వాత కాలంలో రూపురేఖలనే కోల్పోయాయి. చాలా ఏళ్లపాటు ఆ ప్రాంతానికి వెళ్లేందుకు సందర్శకులు భయపడిపోయారు. ఇప్పుడిప్పుడే నివాసాలు, రిసార్టులు, మ్యూజియంలు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే సముద్రానికి కిలోమీటర్ అవతల మాత్రమే ఏర్పాటుచేసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నటు తెలిపారు. మత్స్యకారులు మాత్రం తమ జీవనోపాధిని దృష్టిలోపెట్టుకొని తీరం సమీపానికి చేరుకున్నారు. వారిలో సునామీ తాలూకూ భయాన్ని తొలగించేందుకు అధికారులు, ఏటా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇండోనేషియా తర్వాత శ్రీలంకపై సునామీ తీవ్ర ప్రభావం చూపింది. సుమారు 40వేల మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నాటి విపత్తులో ప్రాణాలతో బయటపడినవారు 20 ఏళ్ల నాటి విధ్వంసాన్ని తలచుకుని ఇప్పుటికీ కుమిలి పోతున్నారు. ఇటు భారత్‌లోనూ సునామీ సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. అండమాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకూ. అధికారిక లెక్కల ప్రకారమే 15వేల 749 మంది మరణించారు. 5వేల 640 మంది ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. వేలాది మంది సర్వం కోల్పోయారు.
అండమాన్ నికోబార్ దీవుల్లో 15 వందల మందికిపైగా మృత్యువాత పడ్డారు. నాటి విధ్వంసాన్ని కళ్లారా చూసిన వారు దానిని గుర్తుచేస్తేనే ఉలిక్కి పడుతున్నారు. సముద్రపు నీరు మృత్యువులా వెంటాడిందని, అడ్డొచ్చినవాటన్నింటినీ కబళిస్తూ కరాళనృత్యం చేసిందని చెబుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని మోకాళ్లలోతు నీళ్లలో సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీసినట్లు వివరిస్తున్నారు. తమిళనాడు తీరంలోనూ సునామీ చావు డప్పు మోగించింది. సుమారు 8వేల మంది ప్రాణాలు కోల్పోగా నాగపట్నం, చెన్నై, కడలూరు తీరప్రాంతాల్లో మృత్యుఘోష ఎక్కవగా వినిపించింది.
భారత్ తర్వాత థాయిలాండ్‌పై సునామీ ప్రభావం ఎక్కువగా కనిపించింది. 5400 మంది మరణించగా, 3వేల మంది ఆచూకీ లభించలేదు. చనిపోయినవారిలో ఎక్కువ మంది పర్యటకులు ఉన్నారు. తీరంలో సేదదీరుతున్న వందలాది మంది రాకాసి అలలకు గల్లంతయ్యారు. ఇళ్లు, రెస్టారెంట్లు ధ్వంసయ్యాయి. అయితే థాయిలాండ్ ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టి సాధారణ పరిస్థితులు నెలకొల్పింది. కొద్దికాలానికే పర్యటకుల తాకిడి కూడా పెరిగింది.
భారత భూభాగంలోని టెక్టోనిక్ పలకాలు, మయన్మార్ భూభాగానికి చెందిన టెక్టోనిక్ పలకాలతో రాపిడి చెందడం వల్ల.. సముద్రగర్భంలో భారీ భూకంపం సంభవించి సునామీ ఏర్పడిందని నాడు శాస్త్రవేత్తలు తేల్చారు. సునామీ హెచ్చరికలకు సంబంధించి అధునాతన వ్యవస్థలు లేకపోవడం వల్లే తీవ్రతను శాస్త్రవేత్తలు అంచనా వేయలేక పోయారని చెబుతున్నారు. 2004 తర్వాత ప్రపంచ దేశాలు భూకంపాలు, సునామీలను అంచనా వేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున అభివృద్ధి చేయడం సహా పరస్పరం పంచుకున్నాయి.