Niranjan Reddy On Rythu Runa Mafi : అందరికి రుణమాఫీ చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక సాకు వెతుకుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. అర్హులై ఉండి లక్షన్నర లోపు రుణమాఫీ కాని రైతులు వారి వివరాలు తెలంగాణ భవన్‌కు వాట్సాప్ ద్వారా 8374852619 నంబర్‌కు పంపాలని కోరారు. అనుభవజ్ఞులు వాటిని పరిశీలిస్తారని, పార్టీ తరపున ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. రైతులకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి అమెరికా నుంచి డాలర్లు తీసుకొస్తారేమోనని ఎద్దేవా చేశారు.
రైతులకు రుణమాఫీ కాలేదు : స్పష్టత ఇవ్వకుండా మొత్తం ఇచ్చినట్లు దబాయింపు చేస్తున్నారని, రైతులు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారని అన్నారు. రుణమాఫీ కాలేదని ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. పాసు బుక్కులో, బ్యాంకు ఖాతాలో పేర్లు వేరుగా ఉన్నాయని కూడా రుణమాఫీ చేయడం లేదని, లక్షన్నర లోపు రుణం ఉండి ఇంకా మాఫీ కాని రైతులు ఉన్నారని, గ్రామాల్లోకి వస్తే చూపిస్తామని చెప్పారు.
సీఎం, ఉపముఖ్యమంత్రి, మంత్రులు ఒక రకంగా చెబుతుంటే కొర్రీలు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నించారు. రైతులు ఈ సర్కార్‌పై భ్రమల్లో ఉండాల్సిన అవసరం లేదన్న నిరంజన్ రెడ్డి రుణమాఫీ కాని వారి వివరాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని, ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని తెలిపారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని కాంగ్రెస్ సర్కార్‌ను కోరుతున్నామన్న ఆయన ఏ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకోలేదని మండిపడ్డారు.