KTR Lok Sabha Election Campaign in Telangana 2024 :తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది ప్రచారం జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలో అత్యధిక స్థానాలను గెలుచుకునేందుకు బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. రోడ్ షోలు, సమావేశాలు, సభలు, ఇంటింటి ప్రచారాలతో ఓట్ల వేట కొనసాగిస్తున్నారు. అభ్యర్థులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
Lok Sabha Elections 2024 :తాజాగా ఈరోజు సిరిసిల్లలో కరీంనగర్ లోక్‌సభ బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్‌పల్లి విన్‌ద్‌కుమార్ మద్దుతుగా పార్టీ కార్యానిర్వహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మార్నింగ్ వాక్‌లో భాగంగా ఆయన పట్టణంలోని రైతు బజార్, గాంధీ చౌక్,లేబర్ అడ్డా ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలతో ముచ్చటిస్తూ వినోద్‌కుమార్ మద్దతుగా నిలవాలని కోరారు. అదేవిధంగా వారి సమస్యలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.
ప్రజలతో మాట్లాడినప్పుడు వారి సమస్యలు తెలిపారని కేటీఆర్ అన్నారు. రైతు బజార్‌కి వెళ్లినప్పుడు అక్కడి రైతులు కొన్ని సమస్యలను విన్నవించారని తెలిపారు. మౌలిక సదుపాయాలైన త్రాగు నీరు, నీడ కల్పించాలని కోరారని పేర్కొన్నారు. ఇందుకోసం స్థానిక మున్సిపల్ ఛైర్మన్‌తో మాట్లాడి 24 గంటల్లో వారి సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి మంచి స్పందన వస్తుందని కేటీఆర్ చెప్పారు.