BRS Chief KCR Focus on Party Development : శత్రువులు, ప్రత్యర్థుల కుటిల యత్నాలను అధిగమిస్తూ అప్రతిహతంగా కొనసాగుతున్న బీఆర్ఎస్ విజయ ప్రస్థానంలో నిన్నటి(లోక్‌సభ) ఓటమితో దిష్టి తీసినట్లైందని, తిరిగి పునరుత్తేజంతో మరింతగా ప్రజాదరణను కూడగట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. రెండున్నర దశాబ్దాల పార్టీ ప్రస్థానం ప్రతి అడుగులో అద్భుతమైన విజయగాథలే తప్ప అపజయ గాథలు లేవన్న ఆయన, తెలంగాణ సాధన కోసం బయలుదేరిన నాటి వ్యతిరేక పరిస్థితులనే తట్టుకుని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదని వ్యాఖ్యానించారు.
ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో మహబూబాబాద్, మేడ్చల్, నల్గొండ జిల్లాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణ అస్థిత్వమే ప్రమాదంలో పడిన దిక్కు మొక్కు లేని చివరిదశ ఉద్యమకాలం నుంచి తెలంగాణ రాష్ట్ర సాధన, ఆ తర్వాత పదేళ్ల ప్రగతి పాలన వరకు తాను ఎదుర్కొన్న కష్టాలను ఆయన కార్యకర్తలకు వివరించారు.
చంద్రబాబును ఎదురించడం అంటే అంత ఆషామాషీ కాదు : ఆనాడు తెలంగాణను అష్ట దిగ్బంధనం చేసిన సమైక్యవాద శక్తులు, అత్యంత శక్తిమంతమైన ఆంధ్రా వ్యవస్థలను తట్టుకుంటూ, సమైక్య వాదానికి సింబాలిక్‌గా ఉన్న నాటి పాలకుడు చంద్రబాబును ఎదురించి నిలవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని చెప్పారు. అటువంటి సమైక్యవాద, కుటిల వ్యవస్థలనే బద్దలుకొట్టి తెలంగాణను సాధించి, కలబడి నిలబడిన తెలంగాణ సమాజం, భవిష్యత్తులో ఎటువంటి ప్రతిబంధక పరిస్థితులనైనా అధిగమిస్తుందని వ్యాఖ్యానించారు.
గెలుపు, ఓటములకు అతీతంగా తెలంగాణ సమాజం తమకు ఎల్లవేళలా అండగా ఉందన్న ఆయన భవిష్యత్తులోనూ ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇచ్చిన అలవికాని హామీలు అమలు చేయడం చేతగాక పలురకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటోందని కేసీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు, ఓటేసి పొరపాటు చేశామని నాలిక కర్చుకుంటున్నారని అన్నారు.