కేసీఆర్ బస్సు యాత్ర షురూ - 17 రోజుల్లో 12 నియోజకవర్గాలను చుట్టేయనున్న బీఆర్ఎస్ అధినేత BRS Chief KCR Bus Yatra Started in Telangana: భారత రాష్ట్ర సమితి అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. నేటి నుంచి 17 రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. సరిగ్గా 1:40 గంటలకు బీఆర్ఎస్ భవన్కుకేసీఆర్ చేరుకున్నారు. భవన్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. బస్సు యాత్రకు బయలు దేరే ముందు మహిళలు మంగళహారతులతో కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. బస్సులోకి ఎక్కుతూ కేసీఆర్ కార్యకర్తలకు అభివాదం చేశారు. అనంతరం బస్సులో కూర్చుండి అభివాదం చేస్తుండగానే బస్సు బయలుదేరింది.
మరోవైపు కేసీఆర్ బస్సు యాత్రకు స్వాగతం పలుకుతూ కార్యకర్తలు బాణా సంచా కాల్చారు. బీఆర్ఎస్ భవన్ నుంచి కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ సభకు బయలుదేరి వెళ్లారు. బస్సుతో పాటు మరో రెండు వాహనాలు యాత్రకు బయలుదేరి వెళ్లాయి. ఒకటి చిన్న చిన్న ప్రాంతాల్లోకి వెళ్లే 11 సీటర్ల వాహనం, మరొకటి ప్రచార రథం. ఈ రెండు కూడా బస్సు యాత్రలో ఉంటాయని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.
మిర్యాలగూడలో మొదలై సిద్దిపేటలో ముగింపు - కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఇదే
పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించిన కేసీఆర్, నేటి నుంచి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మెదక్, చేవెళ్ల, కరీంనగర్, బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన, నేటి నుంచి రోడ్‌షోల ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. మిర్యాలగూడతో ప్రారంభించి, లోక్‌సభ నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు నిర్వహించనున్నారు. మొత్తం 17 రోజుల పాటు 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు. చివరి రోజైన మే 10న సిరిసిల్లలో రోడ్ షో, సిద్దిపేటలో బహిరంగ సభ నిర్వహించి బస్సు యాత్రను ముగిస్తారు.
'కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీతోనే ముప్పు - లోక్‌సభ ఎన్నికల తర్వాత తలెత్తే గందరగోళంతో బీఆర్ఎస్‌దే భవిష్యత్'
హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, ఆదిలాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు జరగనున్నాయి. రోడ్ షోలలో భాగంగా ఉదయం అన్నదాతల సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు, ధాన్యం కల్లాలను సందర్శిస్తారు. రైతులను పరామర్శిస్తూ, వారి కష్టనష్టాలను తెలుసుకుంటారు. సాయంత్రం పూట లోక్ సభ నియోజకవర్గ పరిధిలో రోడ్ షోలు నిర్వహిస్తారు. వేసవి కాలంలో 17 రోజుల పాటు బస్సు యాత్ర జరగనుండటంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. బస్సును అందుకు అనుగుణంగా తీర్చిదిద్దారు.
ఏప్రిల్ 22 నుంచి కేసీఆర్ బస్సు యాత్ర - మిర్యాలగూడలో ప్రారంభం