Rashmika Says Sorry : వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంటోంది నేషనల్ క్రష్ రష్మిక. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. అయితే కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు రష్మిక వీరాభిమాని అని తెలిసిందే. తాజాగా వైరల్ అయిన వీడియోలో రష్మిక మాట్లాడుతూ - తాను థియేటర్‌లో చూసిన తొలి సినిమా విజయ్ నటించిన 'గిల్లి' అని చెప్పింది.
అంతవరకు బాగానే ఉన్నప్పటికీ, ఆ తర్వాత గిల్లి సినిమా గురించి వివరిస్తూ ఆ సినిమా తెలుగులో మహేశ్ బాబు హీరోగా వచ్చిన పోకిరికి రీమేక్ అని, అందులోని ఓ పాట అంటే తనకెంతో ఇష్టమని చెప్పింది. తన జీవితం మొత్తంలో ఇప్పటి వరకు ఆ సాంగ్‌కు ఎన్నోసార్లు స్టేజ్ మీద డ్యాన్స్ వేసినట్లు తెలిపింది. తాను స్క్రీన్ మీద చూసిన తొలి హీరో విజయ్ అని, ఫస్ట్ హీరోయిన్ త్రిష అని మాట్లాడింది.
కానీ వాస్తవానికి గిల్లి సినిమా మహేశ్ బాబు నటించిన 'ఒక్కడు'కు రీమేక్‌గా తెరకెక్కింది. దీంతో రష్మిక పోకిరి రీమేక్ అని చెప్పడం వల్ల కొందరు ఆమెను సరదాగా ఆట పట్టిస్తూ ఆ ఇంటర్వ్యూ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ పోస్ట్‌కు రష్మిక తెలుగులో రిప్లై పెట్టింది.
"అవును. సారీ. గిల్లి సినిమా ఒక్కడుకు రీమేక్ కదా అని ఇంటర్వ్యూ అయిపోయాక అనుకున్నాను. పోకిరిని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూను ఇప్పుడు వైరల్ చేసేస్తారు అని కూడా అనుకున్నాను. నిజంగా సారీ. నాకు వాళ్లు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే" అంటూ ఫన్నీ ఎమోజీలను జోడించింది రష్మిక. అయితే తెలుగులో రష్మిక ఇలా సరదాగా సారీ చెప్పడం అందరినీ ఆకర్షిస్తోంది.
కాగా, దళపతి విజయ్ అంటే తనకు ఎంత ఇష్టమో సందర్భం వచ్చినప్పుడల్లా రష్మిక చెబుతుంటుంది. వీరిద్దరూ కలిసి నటించిన వారిసు (వారసుడు) చిత్రం గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్నే అందుకుంది. ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణను దక్కించుకున్నాయి.
అలాంటి పాత్రలు చూపించాలంటే ధైర్యం కావాలి : రష్మిక
లైఫ్ పార్ట్నర్ గురించి రష్మిక కామెంట్స్- అలా ఉండే వాడు కావాలట!