Telangana Govt will be issue New Ration Cards after Sankranti : రాష్ట్రంలో రేషన్ కార్డుల దరఖాస్తులకు త్వరలోనే మోక్షం లభించనుంది. వచ్చే నెల సంక్రాంతి తర్వాత అర్హులకు కొత్త రేషన్ కార్డులను జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పాత పద్ధతిలో కాకుండా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన రేషన్ కార్డులను అర్హులకు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో కొన్ని నెలలుగా రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే వారిలో ఎంత మంది రేషన్‌కార్డుల అర్హులు ఉన్నారో క్షేత్రస్థాయి పరిశీలన తరవాత స్పష్టత వస్తుందని శుక్రవారం ఓ ఉన్నతాధికారి తెలిపారు.
దాదాపు రెండున్నరేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డుల దరఖాస్తులను ఆహ్వానించి అర్హులకు కార్డులను జారీ చేసింది. ఆ తర్వాత నుంచి రేషన్ కార్డులు జారీ చేసిన దాఖలాలు లేవు. గతంలో కూడా రేషన్ కార్డుల జారీ ప్రక్రియ తరచుగా జరిగింది. రేషన్ కార్డుల జారీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఏకీకృతం చేసింది. దీంతో ఎప్పటికప్పుడు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడే కార్డులు జారీ చేస్తోంది. రేషన్ కార్డుల కోసం దాదాపు 4.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
అధిక శాతం హైదరాబాద్ పరిధిలోనే పెండింగ్ : అధిక శాతం హైదరాబాద్ జిల్లా పరిధిలోనే పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు అంటున్నారు. కొత్తగా జారీ చేసే రేషన్‌కార్డులో ఎలక్ట్రానిక్ చిప్‌ను ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆ చిప్‌లో కుటుంబ సభ్యుల సంఖ్య, చిరునామా ఇతర సమాచారం ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం గ్రేటర్‌లోని మూడు జిల్లాల్లో సుమారు 17.21 లక్షల కార్డులు ఉన్నాయి. అయితే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు అర్హులు ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
6 కిలోల బియ్యంతో పాటు సన్నబియ్యం : మరోవైపు సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు అందజేస్తామని శాసన మండలిలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే వెల్లడించారు. అయితే దాదాపు కొత్తగా 36 లక్షల మందికి రేషన్ కార్డులను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు చెప్పారు. కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ వేశామన్న ఆయన, ఇప్పుడు ఇస్తున్న ఆరు కిలోల బియ్యంతోపాటు సన్నబియ్యం కూడా అందజేస్తామని పేర్కొన్నారు. రేషన్ కార్డులను పాత పద్ధతిలో కాకుండా కొత్తగా అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రానిక్ చిప్‌లను ఏర్పాటు చేసి అందజేస్తామని వెల్లడించారు.
తెల్లరేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ - జనవరి నుంచి సన్న బియ్యం - MINISTER UTTAM ON RATION RICE