Road Accident at Dargah in Devarakonda : నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణ శివారు పెద్ద దర్గా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీసీఎం అదుపు తప్పి మిఠాయిల దుకాణంలోకి దూసుకెళ్లడంతో మహిళ సహా ముగ్గురు మృత్యువాతపడ్డారు. మరొకరికి గాయాలయ్యాయి. మృతులు అబ్దుల్ ఖాదర్, హాజీ, నబీనాగా పోలీసులు గుర్తించారు. రెండ్రోజులుగా పట్టణంలోని పెద్ద దర్గా వద్ద ఉర్సు ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో మిఠాయి దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్న చిరు వ్యాపారితో పాటు దర్శనానికి వచ్చిన మరో ఇద్దరిని అనుకోని రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. అదే సమయంలో దర్గాకు వచ్చిన అబ్దుల్ ఖాదర్, నబీనా మిఠాయి దుకాణం ముందు నిల్చోగా, అతివేగంగా వస్తున్న డీసీఎం అదుపుతప్పి మిఠాయిల దుకాణంలోకి దూసుకెళ్లింది.
శిథిలాల కింది చిక్కుకున్న మృతదేహాలు : దీంతో మహిళ సహా ముగ్గురిపై బండరాళ్లు పడి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, శిథిలాల కింది చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసి దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం డీసీఎం డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల వరకు హవాలి కార్యక్రమంలో పాల్గొని, తిరిగి వెళ్లే క్రమంలో ఈ ఘటన జరిగిందంటూ వారి కుటుంబసభ్యులు, బంధువులు రోదించారు. మృతుల కుటుంబసభ్యలు రోదించిన తీరు అక్కడున్న వారిని కలిచివేసింది.
మంచులో అదుపుతప్పిన కారు - ప్రమాదంలో తెలంగాణ యువకుడి మృతి
కొత్త కారుకు పూజలు చేసుకుని వస్తుండగా ప్రమాదం - నలుగురి మృతి