Kcr Road Show At Bhuvanagiri : దేశంలో అనేక సమస్యలు ఉంటే బీజేపీ అవేమీ పట్టించుకోకుండా అక్షింతలు, ప్రసాదాలు, శోభాయాత్రలపైనే దృష్టిపెట్టిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ పదేళ్ల పాలనలో ఏ వర్గం వారైనా లభం పొందారా? అని ఆయన ప్రశ్నించారు. భువనగిరిలో రోడ్ షోలో పాల్గొన్న కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. 'భేటీ పడావో భేటీ బచావో' నినాదాలకే పరిమితమయ్యాయని దుయ్యబట్టారు. దేశ చరిత్రలో ఏనాడు లేని విధంగా డాలర్ ధర పెరిగిపోయిందన్నారు.
KCR Fires On BJP Congress :భువనగిరిలో బీజేపీ, కాంగ్రెస్‌లు రెండు మిలాఖత్ అయ్యాయన్నారు. రెండో రోజు బస్సు యాత్రలో భాగంగా కేసీఆర్ సూర్యాపేట నుంచి భువనగిరికి వచ్చారు. ఈ సందర్భంగా మార్గ మధ్యలో తనను చూసేందుకు వచ్చిన ప్రజలతో కేసీఆర్ ముచ్చటించారు. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న కేసీఆర్ 24 గంటల కరెంట్ నాశనం చేసిందని విమర్శించారు. మాయమైన బోరుబండ్లను మళ్లీ తెరపైకి తెచ్చారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రైతు బంధు లేదు కరెంటూ లేదని ఆయన దుయ్యబట్టారు.
'నా గుండె చీలిస్తే కనిపించేది తెలంగాణ ప్రజలు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మీ కోసమే(ప్రజల) ఉంటాను. మంచి మెజార్టీతో క్యామా మల్లేశ్‌ను గెలిపించాలని కోరుతున్నాను. భగవంతుడు తెలంగాణ కోసమే నన్ను పుట్టించాడనిపిస్తోంది. ఒక పార్టీ దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుగుతోంది, మరో పార్టీ ఎక్కడికి వెళితే అక్కడ ఒట్టు వేస్తోందని కేసీఆర్ విమర్శించారు. ఈ ఎన్నికల్లో మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి. ఓటర్లు ఆలోచించి పరిణితితో ఓట్లు వేయాలని కోరుతున్నా' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
రైతులు ఆత్మహత్యలపై పట్టించుకునే నాథుడే లేడు :కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనే దిక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని కేసీఆర్ విమర్శించారు. మిల్లర్లు దగ్గర కమీషన్లు తీసుకొని రైతులను గాలికి వదిలేశారని తెలిపారు. తొమ్మిదేళ్లలో ఎప్పుడూ లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని ఆయన ప్రశ్నించారు. తాను పక్కకి పోగానే అన్నీ బంద్ అయ్యాయన్న గులాబీ దళపతి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 225 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదని మండిపడ్డారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే పట్టించుకునే నాథుడే లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు.