ఆరు నెలల్లోనే బ్యాక్ టు ఫామ్ - పడిలేచిన కెరటంలా రాణించిన బీజేపీ - BJP WINS CHEVELLA LOK SABHA 2024 - BJP WINS CHEVELLA LOK SABHA 2024
Chevella Lok Sabha Election Results 2024 : వికారాబాద్ జిల్లా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇందుకు తాజాగా వెలువడిన లోక్‌సభ ఫలితాలే నిదర్శనం. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ సత్తా చాటగా బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. కానీ ఆరు నెలల్లోనే కమలం పార్టీ పుంజుకొని చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకోవడంతో పాటు ఓటు బ్యాంకును పెంచుకుంది.
Political Changes in Vikarabad District (ETV Bharat)
Political Changes in Vikarabad District : వికారాబాద్ జిల్లా రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇందుకు సాక్ష్యం తాజా లోక్‌సభ ఫలితాలు. గత సంవత్సరం డిసెంబర్ 3న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని 7 శాసనసభ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 3 (వికారాబాద్, తాండూర్, పరిగి) స్థానాల్లో విజయం సాధించాయి. కొడంగల్‌లో హస్తం పార్టీ గెలిచినా మహబూబ్‌నగర్ ఎంపీ పరిధిలో ఉంది. కానీ తాజాగా పార్లమెంట్ ఫలితాలు తారుమారు కావడం అనూహ్య పరిణామంగా నిలిచింది.
Chevella Lok Sabha Election Results 2024 :గత శాసనసభ ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వలేక మూడో స్థానానికే పరిమితమై చతికిల పడిన బీజేపీ లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి పడి లేచిన కెరటంలా ఎగిసింది. జిల్లాలోని 97 పురపాలక వార్డుల్లో పట్టుమని పది మంది కౌన్సిలర్లు కూడా లేరు. నాలుగున్నర నెలల స్వల్ప వ్యవధిలోనే కమలం పార్టీ అనూహ్యంగా పుంజుకొని చేవెళ్ల పార్లమెంట్ స్థానాన్ని 1,72,897 ఓట్ల భారీ మెజార్టీతో కైవసం చేసుకొని కాషాయ జెండాను రెపరెపలాడించింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాక మునుపే భారతీయ జనతా పార్టీ తన అభ్యర్థిగా కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఖరారు చేసింది. దీంతో ఆయన నియోజకవర్గమంతా విస్తృతంగా పర్యటించి మద్దతు కూడగట్టుకోవడం బాగా కలిసి వచ్చింది.
గెలుపు నమ్మకం కొనసాగుతుందని ఆశించిన కాంగ్రెస్ : శాసనసభ ఎన్నికల్లో జిల్లాలో పూర్తిగా కాంగ్రెస్ హవా నడిచింది. ఇదే పంథా లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని పార్టీ అధినేతలు భావించారు. దీనికి అనుగుణంగా నామపత్రాల ప్రక్రియ ముగింపు దశలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ, రంజిత్‌రెడ్డిని పార్టీలో చేర్చుకొని హస్తం పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించింది. ఇది కాంగ్రెస్‌లోని ఓ వర్గానికి, గులాబీ పార్టీకి కంటగింపుగా మారింది.
బీఆర్ఎస్‌కు నమ్మక ద్రోహం చేసిన రంజిత్‌రెడ్డికి గుణపాఠం చెప్పాలని స్వయానా కేసీఆర్ చేవెళ్ల బహిరంగ సభలో విమర్శించడంతో ప్రజల్లోకి బలంగా వెళ్లింది. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గం నుంచి 12,682 ఓట్ల మెజార్టీ వచ్చిన కాంగ్రెస్‌కు పార్లమెంట్ ఎన్నికల్లో 7,569 మెజార్టీకే పరిమితం చేసింది. హస్తం పార్టీ అంతర్గత అసంతృప్తి ఎంపీ ఎన్నికల్లో పరాజయానికి ఓ కారణంగా నిలిచింది.భారత్ రాష్ట్ర సమితి 2014, 2019 ఎన్నికల్లో వరుస విజయాలు నమోదు చేసుకున్నా 2024లో జరిగిన ఎన్నికల్లో మాత్రం పరాభవాన్ని మూట గట్టుకుంది. బీజేపీ, హస్తం పార్టీని ఢీకొట్టలేక మూడో స్థానంలోకి వెళ్లి పోయింది.
2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగింది. అప్పట్లో వికారాబాద్, పరిగి తాండూర్ నియోజకవర్గాల్లో కలిపి బీఆర్ఎస్ 2,26,408 ఓట్లను సాధించింది. తాండూరులో 78,079, పరిగిలో 74,523, వికారాబాద్‌లో 73,806 చొప్పున ఓట్లను సాధించింది. అయితే ఆరు నెలల్లోనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను వెనక్కి నెట్టి మెజార్టీ ఓట్లను సాధించాలని పార్టీ భావించింది.
తీరా ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యే సరికి బీఆర్ఎస్ కనీసం ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీకి పోటీగా నిలవ లేక పోయింది. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి కేవలం 47,617 ఓట్లను మాత్రమే సాధించింది. శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లతో పోల్చి చూస్తే 1,78,791 ఓట్లను నిలబెట్టుకోలేకపోయింది. ఓటు బ్యాంకును కోల్పోయింది.
ఎన్నికలు జరగడానికి రెండు రోజుల ముందు నుంచే పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్‌తో పాటు మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు స్తబ్దుగా ఉండి పోయారు. దీంతో పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లు అనూహ్యంగా బీజేపీకి బదిలీ అయ్యాయి.
అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో పార్టీలు సాధించిన ఓట్లు :