BJP Vijaya Sankalpa Yatra in Telangana : పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీజేపీ సమర శంఖారావం పూరించింది. 17 లోక్‌సభ నియోజకవర్గాలను చుట్టేసేలా విజయ సంకల్ప యాత్రలను చేపట్టింది. మొత్తం ఐదు క్లస్టర్లుగా విభజించిన కమలదళం, నాలుగు క్లస్టర్లలో యాత్రలను ఇవాళ ప్రారంభించి. నారాయణపేట కృష్ణాలో కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభించగా, బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌రెడ్డి శంఖారావం పూరించారు. కుమురం భీం క్లస్టర్‌లోని బాసరలో అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, రాజరాజేశ్వర క్లస్టర్‌లోని తాండూరులో కేంద్రమంత్రి బీఎల్ వర్మ, బండి సంజయ్ ఆరంభించారు.
భాగ్యలక్ష్మీ క్లస్టర్‌లో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్(Pramod Sawant)ఆరంభించారు. మేడారం జాతర నేపథ్యంలో రెండు రోజుల తర్వాత కాకతీయ భద్రకాళి క్లస్టర్‌లో యాత్రను మొదలు పెట్టనున్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు ఇక్కడి సంపదను దోచి దిల్లీకి పంపుతున్నారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కిషన్‌రెడ్డి మండిపడ్డారు. నారాయణపేట జిల్లా కృష్ణాలో యాత్రను ప్రారంభించిన కిషన్‌రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు కుటుంబ పార్టీలేనని ధ్వజమెత్తారు. కాయా, పీయా, చల్‌దీయా అనే రీతిలో బీఆర్ఎస్(BRS) సర్కార్ పనిచేసిందని ఎద్దేవా చేశారు. పేదల సమస్యల పరిష్కారం సహా చంద్రయాన్ వరకు మోదీ ప్రభుత్వం ఎన్నో ఘనతలు సాధించిందని కొనియాడారు.
కేంద్రంలో అవినీతి రహిత పాలన అందిస్తున్న మోదీని, మరోసారి ప్రధానమంత్రిని చేసేందుకు దేశప్రజలంతా సిద్ధంగా ఉన్నారని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అబద్ధాలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్కటి తప్ప గ్యారంటీలు అమలు చేయట్లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ మండిపడ్డారు. నిర్మల్ జిల్లా భైంసాలో విజయ సంకల్ప యాత్రను బిశ్వశర్మ ప్రారంభించగా ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్, రామారావు, మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ(MLC) లక్ష్మణ్ పాల్గొన్నారు. మోదీ సర్కార్ నిర్మించిన హైవేలపైనే రాహుల్‌గాంధీ యాత్రలు చేపడుతున్నారని విమర్శించిన హిమంత, జోడో యాత్ర తర్వాత మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.