BJP MP Candidate DK Aruna Slams CM Revanth : సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమంటే దేవుళ్లపై ప్రమాణాలు చేస్తూ మోసగిస్తున్నారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ మండిపడ్డారు. ఆగస్టు 15లోపు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తానని దేవుళ్లపై ప్రమాణం చేస్తున్న రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే రుణమాఫీ ఇస్తానన్న హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. పాలమూరు జిల్లాకు ఏం చేశారో చెప్పకుండా తనపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మహబూబ్‌నగర్‌లో తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పాలమూరు జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను ఖండించారు.
BJP MP Candidate DK Aruna Comments :అధికారంలోకి వచ్చి 120 రోజులు గడిచినా రుణమాఫీ, రైతుభరోసా పెంపు, పెన్షన్ల పెంపు, మహిళలకు రూ. 2,500 సహా ఇతర హామీలు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే హక్కులేదని అన్నారు. మహబూబ్‌నగర్ ఎంపీ ఎన్నికల్లో తాను గెలిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఊడిపోతుందని, ఎలా ఊడిపోతుందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. తాను ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఏమీ చేయలేదనడం శుద్ధ అబద్ధమని, ఏం చేశానో తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు.
ముదిరాజుల ఓట్ల కోసం దొంగ హామీలు: రేవంత్‌కు తాను సాటి కానప్పుడు తనపై విమర్శలు ఎందుకు చేస్తున్నారని డీకే అరుణ ప్రశ్నించారు. బీసీల పేరిట రేవంత్ ఇచ్చే హామీలన్నీ బోగస్ ఎన్నికల హామీలని విమర్శించారు. 14 సీట్లు గెలిస్తే కడియం శ్రీహరిని మంత్రిని చేస్తానంటున్న రేవంత్ మొదటి కేబినెట్లోనే ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ముదిరాజుల ఓట్ల కోసం దొంగ హామీలు ఇస్తున్నారని కాంగ్రెస్ 14 సీట్లు గెలిచేది లేదు శ్రీహరిని మంత్రిని చేసేది లేదన్నారు. గొల్ల కురుమలు గొర్రెల కోసం చెల్లించిన డీడీ డబ్బులు వడ్డీతో సహా ముందు చెల్లించాలని డిమాండ్ చేశారు.