BJP Leaders unsatisfied on MP candidates :రాష్ట్రంలోని 17 స్థానాల్లో 10 నుంచి 12 సీట్లు కైవసం చేసుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అభ్యర్థులను సైతం ఇతర పార్టీల కంటే ముందుగానే ప్రకటించింది. తమకు టికెట్ వస్తుందన్న ఆశాలపై నీళ్లు చల్లిన బీజేపీ జాతీయ నాయకత్వం, బీఆర్ఎస్ నేతలను పార్టీలో చేర్చుకొని టికెట్ కట్టబెట్టింది. పార్టీ బలోపేతం కోసం పని చేసిన తమకు కాకుండా గులాబీ నాయకులు, కార్యకర్తలను పార్టీలో చేర్చుకోవడం పట్ల కాషాయ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పార్టీ అధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థులకు సహకరించబోమని బాహాటంగానే చెబుతున్నారు.
రెబల్ అభ్యర్థిగా బరిలోకి :ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ బాపూరావును కాదని బీఆర్ఎస్ నుంచి వచ్చిన గోడం నగేశ్‌కు టికెట్ ఇవ్వడంతో అసంతృప్తి రగులుకుంది. ఆదిలాబాద్‌లో తన వల్లే 4 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయని, అయినా పార్టీ తనను పట్టించుకోలేదని సోయం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన రెబల్ అభ్యర్థిగా బరిలోకి దిగుతారని ప్రచారం నడుస్తోంది. దీంతో సోయంను బుజ్జగించేందుకు రాష్ట్ర నాయకత్వం రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డిబాపూరావుతో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలుస్తోంది. అవసరం అయితే నేరుగా కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
Leaders Dissatisfied on BJP MP Candidates : ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సోయం, ఆదివాసీ నేతలతో భేటీ తర్వాత భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలోనూ అరూరి రమేశ్‌కు టికెట్ ఇవ్వడాన్ని స్థానిక నేతలు వ్యతిరేకిస్తున్నారు. తమను కాదని బీఆర్ఎస్(BRS) నుంచి తీసుకొచ్చి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటని రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీస్తున్నారు. వీరందరిని కలుపుకొని ఎన్నికలకు వెళ్లడమే ఇప్పుడు అరూరి ముందున్న సవాల్. రాష్ట్ర నాయకత్వం వీరితో మాట్లాడి పార్టీ నిర్ణయాన్ని గౌరవించాలని కోరే అవకాశాలు కనిపిస్తున్నాయి.