Telangana BJP Key Leaders Lobbying For BJP Chief Post : బీజేపీ జాతీయ నాయకత్వం, దేశవ్యాప్తంగా పార్టీలో సంస్థాగత మార్పులు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇటీవల కొలువుదీరిన ఎన్డీఏ ప్రభుత్వంలో పలు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులకు కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కింది. మరికొందరికి ఉపముఖ్యమంత్రి పదవులు దక్కడంతో ఆ స్థానాల్లో కొత్తవారిని నియమించాలని కమలం పార్టీ భావిస్తోంది. తెలంగాణ, బిహార్, బంగాల్, గుజరాత్, హరియాణా రాష్ట్ర అధ్యక్షులను మార్చనుంది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డికి మరోసారి మోదీ తన కేబినెట్లో అవకాశం ఇచ్చారు. దీంతో అతనిని అధ్యక్ష పదవి నుంచి తప్పించి కేంద్రమంత్రి పదవి ఆశించి భంగపడిన వారికి ఇవ్వాలని అధిష్ఠానం ఆలోచనలో ఉంది.
బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ను అధ్యక్షుడిగా నియమించి బీఆర్ఎస్ను ఖాళీ చేసి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జాతీయ ఉపాధ్యక్షురాలైన మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే ఎట్లా ఉంటుందనే సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్, హైదరాబాద్ నుంచి కిషన్‌రెడ్డిలకి కేంద్రమంత్రి వర్గంలో చోటుదక్కడంతో, దక్షిణ తెలంగాణ నుంచి డీకే అరుణకు బాధ్యతలు అప్పగిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధీటుగా రాష్ట్రంలో పార్టీని ముందుకు తీసుకువెళ్లవచ్చని పలువురు రాష్ట్ర నేతలు దిల్లీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం.
అలాగే మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్‌రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని భావిస్తున్నారు. ఇందిరాగాంధీ గతంలో ప్రాతినిథ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్‌కు కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు. మంచి వాగ్ధాటి కల్గి ఉండటం, ప్రత్యర్థి పార్టీల విమర్శలను తిప్పికొట్టడంలో రఘునందన్ ముందు వరుసలో ఉండటం లాంటి అంశాలు అధిష్ఠానం పరిగణనలోకి తీసుకుంటే రఘునందన్ పేరునూ పరిశీలించే అవకాశం లేకపోలేదు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. అది కాస్త జరక్కపోవడంతో రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.