ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

కారు దిగినందుకూ కేసు- ఐదేళ్లలో చంద్రబాబుపై 22 కేసులతో వెంటాడిన జగన్​ ప్రభుత్వం - Chandrababu nomination

Chandrababu Election Nomination : తన పేరిట 24 కేసులు, 36లక్షల స్థిరాస్తులు, అంబాసిడర్ కారు ఉన్నట్లు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు నామినేషన్​ పత్రాల్లో వెల్లడించారు. కాగా, 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానం కలిగిన చంద్రబాబుపై ఐదేళ్ల కిందటి వరకూ కేవలం 2కేసులే ఉండగా, గత ఐదేళ్లలో 22 కేసులు నమోదు కావడం జగన్ సర్కార్ కక్ష్య సాధింపు ధోరణికి అద్దం పడుతోంది.

chandrababu_nomination
chandrababu_nomination

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 20, 2024, 7:03 AM IST

Updated : Apr 20, 2024, 11:32 AM IST

Chandrababu Election Nomination : 40 ఏళ్ల రాజకీయ జీవితంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ల ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు ఎన్నడూ ఎదుర్కోనన్ని కేసులు గత ఐదేళ్లలో ఎదుర్కొన్నారు. 2019 ముందు వరకు ఆయన మీద రెండు కేసులే ఉండగా ఈ ఐదేళ్లలో 22 కేసులు నమోదయ్యాయి. కుప్పంలో నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనపై ఉన్న కేసులను చంద్రబాబు పొందుపరిచారు. మరోవైపు చంద్రబాబు పేరుపై రూ.36 కోట్ల 31 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు నామినేషన్‌ పత్రాల్లో వివరించారు.

చంద్రబాబు తరపున నామినేషన్ వేసిన భువనేశ్వరి - పసుపు మయంగా మారిన కుప్పం - Chandrababu Nomination

తెలుగుదేశం అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను చంద్రబాబు నామినేషన్‌ పత్రాల్లో వివరించారు. చంద్రబాబు 2019కి ముందు వరకు కేవలం రెండు కేసులే ఉండగా ఐదేళ్ల వైఎస్సార్సీపీ హయాంలో 22 కేసులు నమోదయ్యాయి. 2019కి ముందు గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోన్న బాబ్లీ ప్రాజెక్టు సందర్శన సమయంలో ధర్మాబాద్ పోలీసులు ఒక కేసు నమోదు చేయగా 2012లో ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘించారని మరో కేసు పెట్టారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక 2020లో 5, 2021లో 9, 2022లో 2, 2023లో 6 FIRలు నమోదైనట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. వాటిలో మంగళగిరిలోని సీఐడీ పోలీస్‌ స్టేషన్‌లో 8, అన్నమయ్య, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో రెండు చొప్పున అలాగే.. అనంతపురం, గుంటూరు, పల్నాడు, కర్నూలు, తిరుపతి, విజయనగరం, కృష్ణా, విశాఖ, నంద్యాల జిల్లాల్లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఒక కేసు ఉన్నట్లు వివరించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో రెండు కేసులు నమోదు చేశారు. ఇందులో కురబలకోట మండలం అంగళ్లులో గతేడాది ఆగస్టులో టీడీపీ కార్యకర్తలను వైఎస్సార్సీపీ శ్రేణులు రెచ్చగొట్టినప్పటికీ తిరిగి ప్రతిపక్షంపైనే కేసులు పెట్టారు. చంద్రబాబు హత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొంటూ ఎఫ్ఐఆర్ కట్టారు. విజయనగరం జిల్లా నెల్లిమర్లలో విజయసాయిరెడ్డి వాహనంపై టీడీపీ శ్రేణులు రాళ్లు, నీళ్ల బాటిళ్లు, చెప్పులు విసిరి అద్దాలు పగలకొట్టి చంపబోయారంటూ మరో హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

రెండోరోజు జోరుగా నామినేషన్ల ప్రక్రియ - ర్యాలీలతో తరలివస్తున్న నేతలు - Nominations in AP

ఉచిత ఇసుక పాలసీలో తీసుకున్న విధానపరమైన నిర్ణయంతో రాష్ట్ర ఖజానాకు గండి కొట్టారని, ప్రివిలేజ్ ఫీజు, డిస్టిలరీలు, వివిధ మద్యం బ్రాండ్లకు అనుమతులు ఇస్తూ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ఆదాయానికి నష్టం వాటిల్లిందని, సీఆర్డీఏ, రాజధాని, ఇన్నర్ రింగు రోడ్డు మాస్టర్‌ నిర్ణయాల్లో అవతవకలకు పాల్పడి కొందరికి అనుచితంగా లబ్ధి చేకూర్చారని కేసులు పెట్టారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ ఫైబర్‌ నెట్‌, ఎసైన్డ్‌ భూములు, అధికార దుర్వినియోగం వంటి అంశాలపైనా సీఐడీ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. కొవిడ్ రెండో వేవ్, 440కే వేరియంటు గురించి ప్రచార, ప్రసార, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడి ప్రజల్లో భయాందోళన కలిగించారని గుంటూరు నగరం అరండల్‍ పేట, పల్నాడు జిల్లా నరసరావుపేట రెండో పట్టణ, కర్నూలు ఒకటో పట్టణ స్టేషన్లలో కేసులు పెట్టారు. కొవిడ్ వ్యాక్సిన్లు అందుబాటులో లేవని చెప్పినందుకు చంద్రబాబుపై విజయవాడ నగరం సూర్యారావుపేట ఠాణాలో ఒక కేసు నమోదు చేసినట్లు అఫిడవిట్‌లో వివరించారు.

తిరుపతి జిల్లా ఏర్పేడు, విశాఖలోని విమానాశ్రయం పోలీస్‌ స్టేషన్‌, విజయవాడ పటమట ఠాణాలోని ముందస్తు అరెస్టు, హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తున్నప్పుడు కాన్వాయ్ ఆపి కారు దిగి కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్టు నందిగామ స్టేషన్‍ లో నమోదైన కేసుల్లో చంద్రబాబు పాత్ర రుజువు కాలేదని పోలీసులు కేసులు మూసేశారు. అయినప్పటికీ ముందు జాగ్రత్తగా చంద్రబాబు వాటిని ప్రస్తావించారు. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో మంత్రి ఉష శ్రీచరణ్ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆసుపత్రికి వెళుతున్న ఓ చిన్నారి మృతి చెందారని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారని కల్యాణదుర్గం ఠాణాలో కేసు పెట్టినట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

ఏపీలో 4 బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ - ఎక్కడంటే... - Prime Minister Modi

చంద్రబాబుకు 4 లక్షల 80 వేల చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. అందులో 2 లక్షల 25 వేల 500 రూపాయల విలువైన AP 9G 393 నంబరు గల అంబాసిడర్‌ కారు ఉన్నట్లు తెలిపారు. స్థిరాస్తులు 36 కోట్ల 31 లక్షలు ఉండగా బంగారం ఏమీ లేనట్లు వివరించారు. ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట 810 కోట్ల 37 లక్షల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. అందులో 763 కోట్ల 93 లక్షల విలువైన 2 కోట్ల 26 లక్షల11 వేల 525 హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌లో షేర్లు కాగా.. కోటీ 40 లక్షల విలువైన బంగారం, ఇతర ఆభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. భువనేశ్వరి స్థిరాస్తులు 85 కోట్ల 10 లక్షల రూపాయలు ఉన్నట్లు వెల్లడించారు. కుమారుడు లోకేశ్​తో కలిసి చంద్రబాబు 3 కోట్ల 48 లక్షలు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి ఇంటి రుణం తీసుకున్నట్లు తెలిపారు. భువనేశ్వరికి 6 కోట్ల 83 లక్షల అప్పు ఉండగా అందులో కుమారుడు లోకేశ్​ వద్ద నుంచి కోటీ 27 లక్షలు తీసుకున్నట్లు వివరించారు. ఆదాయ పన్ను శాఖ నుంచి 6 లక్షల 4 వేల 900 రూపాయలపై డిమాండ్ నోటీసుపై వివాదం ఉన్నట్లు పేర్కొన్నారు. భువనేశ్వరి పేరిట కారు లేదని వెల్లడించారు. తాను M.A. చదువుకున్నానని చంద్రబాబు నామినేషన్‍ పత్రాల్లో పేర్కొన్నారు.

చంద్రబాబుపై 24, లోకేశ్​పై 23 కేసులు - అత్యధికంగా వైసీపీ హయాంలోనే ! - Cases on Tdp leaders

కారు దిగినందుకూ కేసు- ఐదేళ్లలో చంద్రబాబుపై 22 కేసులతో వెంటాడిన జగన్​ ప్రభుత్వం
Last Updated : Apr 20, 2024, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details