India US Partnership : అమెరికా ప్రజలు అధ్యక్ష ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు పట్ల భారత్ సంతోషంగా ఉందని విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గురువారం అన్నారు. భారత్, అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాయని చెప్పారు. భారత్-అమెరికాది బహుముఖమైన ప్రత్యేక భాగస్వామ్యని అన్నారు. అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్రమోదీ బుధవారం మాట్లాడారని తెలిపారు. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేలా కలిపి పనిచేస్తామని ఇద్దరు నేతలు పునరుర్ఘాటించినట్లు చెప్పారు. అంతకుముందు మోదీ ఎక్స్ పోస్ట్‌లో ట్రంప్ చారిత్రక ఎన్నికల విజయానికి అభినందనలు తెలిపారని జైస్వాల్ గుర్తు చేశారు.
#WATCH | Delhi: On India-US ties, MEA Spokesperson Randhir Jaiswal says, " india-us partnership is a very special and a multifaceted partnership. our prime minister spoke to president trump yesterday. before that, he also sent a message on 'x' congratulating him on his historic… pic.twitter.com/I3RgE7GHDn
— ANI (@ANI) November 7, 2024
'హెచ్1బీ వీసాలు- మైగ్రేషన్ పార్ట్నర్షిప్లో భాగమే'
ఈ సందర్భంగా హెచ్1బీ వీసాల విషయంపై రణధీర్ జైస్వాల్ మాట్లాడారు. "భారత్-అమెరికా మధ్య ఆర్థిక సంబంధాలు చాలా విస్తృతమైనవి. 2023లో ఇరు దేశాల మధ్య దాదాపు 190 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగింది. వస్తుసేవల్లో అమెరికా- భారత్‌కు రెండో అతిపెద్ద వ్యాపార భాగస్వామిగా ఉంది. ఇక హెచ్1బీ వీసాల విషయానికొస్తే- మొబిలిటీ, మైగ్రేషన్ పార్ట్నర్షిప్ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో భాగం. చాలా వరకు భారతీయ నిపుణులు అమెరికాలో పనిచేస్తున్నారు. అనేక మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. డిఫెన్స్ టెక్నాలజీలో అమెరికా-భారత్ మధ్య పెద్ద పెట్టుబడి భాగస్వామ్యం ఉంది. ఈ అంశాలు అన్నింటిపై మేము వారితో మంచి చర్చలు జరపాలనుకుంటున్నాము." అని జైస్వాల్ తెలిపారు.
ట్రంప్ రెండో టర్మ్- ఆ విషయంలో భారత్‌కు ఇబ్బందే!
అయితే అమెరికాలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో- ట్రంప్ 2.0 హయాంలో వీసా విధానాలు మరింత కఠినతరంగా మారతాయని, ఇవి ఐటీ కంపెనీలకు సవాళ్లను విసురుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో కంపెనీలు అత్యధికంగా ఆన్‌సైట్ మార్కెట్లలో స్థానికులనే నియమించుకోవాల్సిన పరిస్థితి వస్తుందనే ఆందోళనలు ఉన్నాయి. దీంతోపాటు నియర్ షోర్ డెలివరీ సెంటర్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ రెండో టర్మ్, వాణిజ్యపరంగా భారత్‌కు ఇబ్బందులు సృష్టించే అవకాశం ఉందని చెబుతున్నారు. ట్రంప్ విద్యుత్తు వాహనాలకు ఇన్సెంటివ్‌లను తగ్గించే అవకాశాలుండటం వల్ల ప్రధానంగా భారత్ నుంచి ఎగుమతి అయ్యే వాటి స్పేర్‌పార్టులపై స్వల్పకాలం పాటు ప్రతికూల ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయని నిపుణుల అంచనా.
భారత్‌పై ట్రంప్ 2.0 ప్రభావమెంత? వీసాలు, బిజినెస్ విషయంలో ఏం జరగనుంది?