Kids Using Mobile Side Effects: పిల్లలు ఏడుస్తున్నారని, అన్నం తింటారని ఫోన్ ఇస్తున్నారా? అయితే మీరే వారికి తీవ్రమైన హాని తలపెడుతున్నట్టే! వారి ముద్దు మాటలకు మీరు గండికొట్టినట్టేనని నిపుణులు చెబుతున్నారు. మాటలు చెప్పేవారు, ఆటలు ఆడే వారు లేకపోవడంతో పిల్లలు ఆ స్క్రీన్‌లకు అలవాటు పడుతున్నారని.. దీంతో మాటలు రావడం ఆలస్యమవుతోందంటున్నారు. ఇంకా భవిష్యత్తులో ఆటిజం వంటి తీవ్ర సమస్యలనూ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
మనలో చాలా మంది తల్లిదండ్రులు.. అన్నం తింటారనో, మాట వింటారనో, పసి పిల్లల చేతికి సెల్‌ఫోన్ ఇస్తుంటారు. కానీ, రెండేళ్లలోపు పిల్లలు ఫోన్లలో బొమ్మలు చూస్తుంటే ఏది నిజమో? ఏది వీడియోనో సరిగ్గా తెలుసుకోలేరు. అలాంటి సమయంలో చాలా మంది పిల్లలకు రోజుకు నాలుగైదు గంటలు సెల్‌ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఫలితంగా మాటలు రావడం లేదని ఆసుపత్రుల చూట్టూ తిరుగుతున్నారు. పిల్లలు మెలకువగా ఉన్నంత సేపు ఇస్తున్న వారు కూడా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు.
ఆరు నెలలు దాటిన తర్వాత పిల్లలకు మాటలు రావడం ప్రారంభం అవుతుంది. ఆ వయసులో స్క్రీన్‌కు అలవాటైన వాళ్లకు మాత్రం మాటలు తొందరగా రావు. మన చుట్టుపక్కల పరిసరాల స్పందనతోనే మెదడు ఎదుగుతుంది. మొదటి ఐదున్నరేళ్లు మెదడు ఎదుగుదలకు కీలక సమయం. పిల్లలు ఈ వయసులో మాటలు వింటుంటే మెదడు వాటిని గ్రహిస్తూ ఉంటుంది. ఇంట్లో మాట్లాడే మనుషులు లేకపోతే వారికీ అలవాటు కావు.
"6 నెలల వయసు నుంచి పిల్లలు మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఆ సమయంలో పిల్లల చేతికి ఫోన్ ఇచ్చామంటే ఇక ఆ వీడియోలకు అలవాటు పడి చుట్టూ ఏం జరుగుతుందో ఎక్కువగా పట్టించుకోరు. ఫలితంగా మూడేళ్లకు కూడా మాటలు రావు. ఈ పరిస్థితి ఏడీహెచ్‌డీ, ఆటిజం వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా పిల్లలు తినడం లేదని, అల్లరి చేస్తున్నారని వారి చేతికి ఫోన్‌లు ఇవ్వద్దు."
--డాక్టర్ డి.కె.వీణ, స్పీచ్ థెరపిస్టు, ప్రభుత్వ ఈఎన్‌టీ ఆసుపత్రి, కోఠి.
స్క్రీన్ చూసినంత సమయం పిల్లలు ఆ లోకంలో ఉండిపోతారు. ఫోన్ పక్కన పెట్టేసినా పిల్లల బుర్రలో అవే మెదులుతుంటాయి. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు, చుట్టాలు మాట్లాడే మాటలు మెదడుకు ఎక్కవు. ఫలితంగా వారి మెదడు స్పందించడం తగ్గిపోతుంది. ఇంకా పిల్లలకు యూట్యూబ్‌లో పాఠాలు చూపిస్తే ఆంగ్లం బాగా వస్తుందని కొందరు తల్లిదండ్రులు స్క్రీన్ ఇస్తున్నారు. ఇక్కడ ఒక వైపు నుంచే కమ్యూనికేషన్ ఉంటుందని.. దీంతో వారికి ఏదైనా సమస్య ఉంటే బయటపడదని నిపుణులు సూచిస్తున్నారు.
"హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో రోజూ వెయ్యి వరకు ఆటిజం సమస్య ఉన్న పిల్లలను ఆసుపత్రులకు తీసుకువస్తున్నారు. అయితే, పిల్లల్ని స్క్రీన్‌కు దూరంగా ఉంచి, తల్లిదండ్రులు వారితో మాట్లాడుతూ, ఆడుతూ ఉంటే ఈ సమస్యను నివారించవచ్చు."
--ప్రొఫెసర్ ప్రసన్నకుమార్, చిన్నపిల్లల మానసిక వైద్య నిపుణులు, కేజీహెచ్, విశాఖపట్నం
ముఖ్యంగా స్క్రీన్ ఎక్కువ చూసే పిల్లలు చుట్టూ ఉన్నవారు, తల్లిదండ్రులు మాట్లాడే మాటలను వినరని.. వారిని పట్టించుకోరని నిపుణులు చెబుతున్నారు. వీరు మనుషుల ముఖాలు సరిగా చూడరని.. మనుషులతో కలవడం తగ్గిపోతుందంటున్నారు. ఫలితంగా కొత్త వాళ్లు కలిసినప్పుడు ఎలా మాట్లాడాలో అర్ధం కాదని.. ఇతరులతో ఎలా ప్రవర్తించాలో తెలియదని వెల్లడిస్తున్నారు. ఇలాంటి పిల్లలు ఒక్కోసారి మొండిగా మారిపోతారని.. వారి లోకంలో వారు ఎక్కువ సేపు ఉంటే ఆటిజం బారిన పడతారని వైద్యులు వివరిస్తున్నారు.
"వైద్యులు, వైద్య సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు.. పిల్లలను కలిసినప్పుడు వారికి మాటలు సరిగా వస్తున్నాయో లేదో తెలుసుకోవాలి. ఇంకా ఆసుపత్రుల్లో స్పీచ్ థెరపిస్టులు ఉండేలా ఏర్పాటు చేయాలి. తల్లిదండ్రులు పిల్లలతో గడిపితే ఆసుపత్రులకు వచ్చే కేసుల్లో 50 శాతం తగ్గించొచ్చు. ఇంకా విటమిన్ డి లోపం లేకుండా చూసుకోవాలి."
--డాక్టర్ విజయచంద్రారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, ఎయిమ్స్, మంగళగిరి
ఏం చేయాలి?
- ఐదున్నరేళ్లు వచ్చే వరకు పిల్లలకు స్క్రీన్లు అలవాటు చేయకపోవడం ఉత్తమం. కీ ప్యాడ్ ఫోన్లు వాడితే మంచిది.
- ఇంట్లో వాళ్లు పిల్లలతో రోజూ మాట్లాడుతుంటే.. వారు వాటిని గ్రహించి పిల్లలూ మాట్లాడడానికి ప్రయత్నిస్తారు.
- ప్రతి రోజు చిన్నారులతో ఆడాలి. ఎందుకంటే ఆటల మధ్యలో వాడే మాటలు త్వరగా గుర్తుంటాయి. ఒక్కరే ఆడుకుంటే ఏ ప్రయోజనం ఉండదు.
- బొమ్మల పుస్తకాలు చూపించి, పిల్లలకు చెబుతూ ఉండాలి. చిన్నచిన్న బొమ్మలతో కథలు చెప్పాలి. ఆ వస్తువు, పదాలు గుర్తుండిపోతాయి.
- చిన్న వయసులో మాటలు రాకపోవడాన్ని గుర్తిస్తే వెంటనే స్క్రీన్లు ఆపేసి, పిల్లలతో మాట్లాడడం మొదలు పెడితే వారు సాధారణ స్థితికి చేరుకుంటారు.
- అయితే, లోపాన్ని గుర్తించకుండా మాటలు వస్తాయిలే అనుకుంటూ గడిపేస్తే ఐదేళ్ల తర్వాత చాలా కష్టమవుతుంది.
- ఇంకా పిల్లవాడికి సిగ్గు ఎక్కువ మాట్లాడడని తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. దీంతో చికిత్స సరైన సమయంలో అందడం లేదు.
మీ వయసు ప్రకారం రోజుకు ఎంత సేపు నిద్రపోవాలి? ఈ టిప్స్ పాటిస్తే సుఖంగా నిద్రపోతారు!
గుడ్లు ఎలా ఉడికించాలో మీకు తెలుసా? కరెక్ట్ పద్ధతి ఇదేనని శాస్త్రవేత్తల వెల్లడి- ఇంకా లాభాలెన్నో!