Australia Proposes to Ban Social Media for Children: ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంతా సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తున్నారు. అయితే ఈ వినియోగం పిల్లల జీవితంపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. సోషల్ మీడియా వల్ల పిల్లలు మానసిక కుంగుబాటుతో పాటు అనేక సమస్యలకు గురవుతున్నారు. దీంతో దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ కొత్త చట్టాన్ని అమలు చేయాలని ప్రతిపాదించింది.
16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించేలా చట్టం చేయనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ తెలిపారు. తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఫిర్యాదుల ఆధారంగానే ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం వయసు ధ్రువీకరణ విధానాన్ని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది చివరి నాటికి ఈ చట్టం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
సోషల్ మీడియా వినియోగం పిల్లలకు హాని చేస్తోంది. దీన్ని ఎక్కువగా ఉపయోగించడం వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా అమ్మాయిల్లో అసభ్యకరమైన ఆలోచనలను రేకెత్తిస్తున్నాయి. మైసోజినిస్టిక్ టాపిక్స్ అబ్బాయిలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. అశ్లీల దృశ్యాలు, చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంపై ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాలను అరికట్టేందుకు ఈ ఏడాది ఆస్ట్రేలియా పార్లమెంట్లో చట్టాన్ని ప్రవేశపెట్టనున్నట్లు అల్బనీస్ విలేకరుల సమావేశంలో తెలిపారు.
ప్రజాప్రతినిధులు ఆమోదించిన 12 నెలల తర్వాత ఈ చట్టం అమల్లోకి వస్తుందని అల్బనీస్ వెల్లడించారు. దీనికి ప్రతిపక్ష లిబరల్ సభ్యులు కూడా మద్దతు పలికినట్లు తెలిపారు. తల్లిదండ్రుల సమ్మతి ఉన్న పిల్లలకు లేదా ఇప్పటికే అకౌంట్స్ ఉన్న పిల్లలకు కూడా ఇందులో మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు కూడా చిన్నారులకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఈ బాధ్యత తల్లిదండ్రులు లేదా యువతపై ఉండదని అల్బనీస్ చెప్పారు.
గతేడాది 15 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించాలని ఫ్రాన్స్ ప్రతిపాదించింది. కానీ వినియోగదారులు తల్లిదండ్రుల సమ్మతితో నిషేధాన్ని దాటవేయగలిగారు. మరోవైపు USలో 13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను యాక్సెస్ చేయాలంటే తల్లిదండ్రుల సమ్మతి తప్పనిసరిగా ఉండాల్సిందే.
పెరుగుతున్న స్మార్ట్ఫోన్ల ధరలు- అసలు తయారీకి కంపెనీలు ఎంత ఖర్చుపెడుతున్నాయో తెలుసా?
ఫ్యామిలీతో కలిసి టీవీ చూడలేకపోతున్నారా?- ఈ ఫీచర్‌తో ఇకపై అడల్ట్ సీన్స్ భయం లేదుగా..!