HYDRA Demolitions Again Started in Hyderabad : తెలంగాణ రాష్ట్ర రాజధానిలో కొన్ని రోజుల నుంచి నిశ్శబ్దంగా ఉన్న హైడ్రా మరోసారి అక్రమ నిర్మాణాల కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణల కూల్చివేతలపై కొద్ది రోజులుగా నిశ్శబ్దంగా ఉన్నా, తాజాగా ఫిల్మ్ నగర్ రోడ్డు నెం.12లో బుల్డోజర్లతో హైడ్రా విరుచుకుపడింది. అక్కడి ప్రముఖుల విగ్రహాల సమీపంలోని నిర్మాణాన్ని నేలమట్టం చేసింది. జేసీబీల సహాయంతో హైడ్రా సిబ్బంది షెడ్డును కూల్చివేశారు.
ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీ రోడ్డును ఆక్రమించి 'ఫిల్మ్ నగర్ మహిళా మండలి' పేరుతో నిర్మాణం చేపట్టి కార్యకలాపాలు నిర్వహిస్తోందంటూ స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన హైడ్రా, కొద్ది రోజుల కిందట ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీకి నోటీసులు జారీ చేసింది. అనధికారికంగా నిర్మించిన ఫిల్మ్ నగర్ మహిళా మండలి భవనాన్ని 24 గంటల్లో తొలగించాలని హైడ్రా ఆదేశించింది.
అయితే దీనికి ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో, అనధికారిక నిర్మాణాన్ని కూల్చివేశామని హైడ్రా అధికారులు తెలిపారు. ఆ ప్రదేశంలో ఉన్న విగ్రహాల జోలికి మాత్రం వెళ్లలేదని స్పష్టం చేశారు. అయితే నిర్మాణం కూల్చివేతపై ఫిల్మ్ నగర్ హౌజింగ్ సొసైటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ సొసైటీకి చెందిన 290 గజాల్లో మహిళా మండలి భవనంతో పాటు విగ్రహాలు పెట్టడానికి కేటాయించామని, తాము ఎలాంటి రోడ్డును ఆక్రమించలేదంటూ సొసైటీ కార్యదర్శి ఖాజా సూర్యనారాయణ పేర్కొన్నారు. తమ స్థలంలోని నిర్మాణాన్ని హైడ్రా అన్యాయంగా కూల్చివేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
అంగుళం ఆక్రమించినా తెలిసిపోతుంది: మరోవైపు నగరంలోని చెరువులు, కుంటలను ఎవరూ ఆక్రమించకుండా ఇప్పటికే రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పకడ్బందీగా లెక్కలను సిద్ధం చేస్తున్నారు. డిజిటల్ సర్వేల సహాయంతో చెరువుల విస్తీర్ణాన్ని, బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ (Full Tank Level)ను నిర్ణయిస్తున్నారు. ప్రతి చెరువుకు సంబంధించిన అంశాలను జియో ట్యాగ్ చేసి హెచ్‌ఏండీఏ (Hyderabad Metropolitan Development Authority) వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తుది సర్వే కూడా పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.
అలా చేయకుంటే చర్యలు తప్పవు - బిల్డర్లకు హైడ్రా రంగనాథ్ హెచ్చరిక
2025 నాటికి హైదరాబాద్‌లోని చెరువులకు పూర్వవైభవం - బెంగళూరు తరహాలో పునరుజ్జీవం