Police Arrest YSRCP Social Media Activist : వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు వారు ఇష్టారీతిన చెలరేగిపోయారు. సోషల్ మీడియా వేదికగా విషం కక్కారు. పెద్దల అండ చూసుకొని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై తప్పుడు ప్రచారాలు, మార్ఫింగ్ చిత్రాలు, అసభ్య దూషణలతో పేట్రేగిపోయారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక సైతం ఇదే మాదిరి దండయాత్ర, దీంతో ఉమ్మడి గోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటువంటివారిపై పోలీసులు తాజాగా కేసులు నమోదు చేస్తున్నారు.
నేడు న్యాయస్థానంలో హాజరు : ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా పోస్టులు పెట్టిన రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన వీరభత్తుల చంద్రశేఖర్ అనే వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిని పోలీసులు అరెస్టు చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తదితరులను కించపరిచేలా వేరు వేరు పేర్లతో తప్పుడు ప్రచారానికి పాల్పడటంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ప్రాథమిక విచారణ అనంతరం 2 కేసులు నమోదు చేసి చంద్రశేఖర్‌ను అరెస్టు చేశామని గోపాలపురం సీఐ నాగేశ్వరనాయక్, ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. గోపాలపురం మండలం చిట్యాలకు చెందిన యువకుడి ఫిర్యాదు మేరకు ఈ చర్యలు చేపట్టామని అన్నారు. శుక్రవారం న్యాయస్థానంలో హాజరు పరుస్తామన్నారు.
వైఎస్సార్సీపీ సోషల్ సైకో నెట్‌వర్క్ - 50 వేల మందితో ఉన్మాదుల కర్మాగారం!
చంద్రశేఖర్‌ను రంగంపేట పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు బుధవారం అర్ధరాత్రి స్టేషన్ ఎదుట, ఆ తర్వాత ఏడీబీ రోడ్డులో నిరసన చేపట్టారు. గురువారం ఉదయం పోలీసులు వీడియోకాల్‌లో చంద్రశేఖర్ కుటుంబ సభ్యులతో మాట్లాడే ఏర్పాటు చేశారు. అనపర్తి వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ భార్య విజయ తదితరులు సీఐతో మాట్లాడారు.
41ఏ నోటీసులు జారీ : చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్ ఇంకా మరికొందరు నేతలను లక్ష్యంగా చేసుకొని సామాజిక మాధ్యమాల్లో అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్న వారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. 41ఏ నోటీసులు జారీ చేసి అరెస్టులకూ వెనుకాడడడం లేదు.
అసభ్యపదజాలంతో తప్పుడు ప్రచారం : రాజమహేంద్రవరం 13వ వార్డుకు చెందిన బొర్ర చిన్నిబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వైఎస్సార్సీపీకి చెందిన ఇంటూరు రవి కిరణ్‌పై ప్రకాశ్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ అసభ్యపదజాలంతో తప్పుడు ప్రచారం చేస్తూ యువతను రెచ్చగొడుతున్నారని ఫిర్యాదు అందింది. రవి కిరణ్‌పై చర్యలు తీసుకోవాలని అందులో ప్రస్తావించగా ఎస్సై శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పార్టీల మధ్య వివాదాలు : కడియం పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్కడి 'టీడీపీ నాయకుడు చెరుకూరి వెంకట ప్రభాకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ వెంకటేశ్వరరావు ఐటీ చట్ట ప్రకారం కేసు నమోదు చేశారు. చంద్రబాబు కుటుంబసభ్యులు, పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసి అవమానకర పోస్టింగులతో పాటు, రెచ్చగొట్టే వ్యాఖ్యానాలతో పార్టీల మధ్య వివాదాలు తలెత్తేలా ఓ గ్రూప్ పేరిట ఈ పోస్టులు ఉన్నాయని పేర్కొన్నారు.
వాళ్లు ఉగ్రవాదులకన్నా ప్రమాదకరం - ఎక్కడ దాక్కున్నా వదలం : హోంమంత్రి అనిత
కాకినాడ గ్రామీణం తిమ్మాపురం పోలీస్ స్టేషన్‌లోనూ ఓ కేసు నమోదు అయ్యింది. జనసేన అధినేతపై సోషల్ మీడియాలో 'కింగ్ లియో ఎక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ కింగ్ లియో -007' ఐడీతో అనుచిత పోస్టింగ్‌లు ఉన్నాయని ఈ నెల 5న తిమ్మాపురానికి చెందిన జనసేన పార్టీ సహాయ కార్యదర్శి తలాటం వీరభద్రరావు ఫిర్యాదు చేశారు. ఎస్సై రవీంద్రనాధ్‌బాబు కేసు నమోదు చేశారు.
మార్గాని భరత్‌పై కేసు నమోదు : కోనసీమ జిల్లాలోనూ వివిధ పోలీస్‌స్టేషన్లలో అయిదు వరకు ఫిర్యాదులు అందాయని, ప్రాథమిక విచారణ అనంతరం కేసుల నమోదుకు నిర్ణయం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసినందుకు రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్‌పై స్థానిక మూడో పట్టణ పోలీసు స్టేషన్‌లో బుధవారం అర్ధరాత్రి కేసు నమోదైంది.
సైకో పార్టీ సోషల్ మీడియాను భ్రష్టు పట్టించింది - ఆఖరికి తల్లిని, చెల్లిని వదల్లేదు: షర్మిల