Minister Komatireddy on Allu Arjun Press Meet: సీఎం రేవంత్‌రెడ్డికి అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తన ఇమేజ్ దెబ్బతీశారంటూ సీఎం వ్యాఖ్యలపై ఎదురుదాడిగా మాట్లాడటం సరికాదని వ్యాఖ్యానించారు. శనివారం నిర్వహించిన అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు లీగల్ టీమ్ ఒప్పుకోలేదనటం హాస్యాస్పదమని మంత్రి అన్నారు. అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తే తన ఇమేజ్ దెబ్బతిన్నదని అల్లు అంటున్నారని మండిపడ్డారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండవని మంత్రి కోమటిరెడ్డి ఖరాకండిగా తెలిపారు.
సీనీ పరిశ్రమను దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరం: జాతీయ అవార్డు గ్రహీత, పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ విషయంలో సీఎం రేవంత్ వ్యవహరిస్తున్న తీరు ఆయన స్థాయికి ఏ మాత్రం సరికాదని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీలో సీఎం థియేటర్ దగ్గర ఘటన ప్రస్తావించి తెలుగు సీనీ పరిశ్రమను దెబ్బతీసేలా మాట్లాడటం బాధాకరమన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతిని ప్రతి ఒక్కరూ ఖండించారని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు త్వరగా కోలుకోవాలని కోరుతూ అందరూ వారికి బాసటగా నిలిచారని గుర్తు చేశారు.
ప్రెస్‌మీట్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చింది: సినీ ప్రముఖులు వ్యాపారం చేసుకుంటే తప్పులేదని, అదే సమయంలో మానవత్వంతో వ్యవహరించాలని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ సూచనలు చేస్తే అల్లు అర్జున్ ప్రెస్‌మీట్ పెట్టవలసిన అవసరం ఏమొచ్చిందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ ప్రశ్నించారు. అల్లు అర్జున్ ప్రజలకు ఏం సందేశం చెప్పాలనుకుంటున్నారో కనీస అవగహన లేకుండా మాట్లాడారన్నారు. అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సూచించారు. అల్లు అర్జున్ వ్యవహారశైలి దారుణంగా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఆయనలో కనీసం పశ్చాత్తాపం కనిపించట్లేదని సీఎం మాటలు తప్పుపట్టేలా ఉన్న అల్లు అర్జున్ తీరు సరికాదంటూ మండిపడ్డారు.
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - వీడియో విడుదల చేసిన పోలీసులు