Prakasam District SP Damodar inquired Doctor Prabhavathi In Raghu Rama krishna Case : రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో A5గా ఉన్న డాక్టర్ ప్రభావతిని ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ విచారించారు. రఘురామపై పోలీస్ కస్టడీలో హత్యాయత్నం చేశారంటూ నమోదైన కేసుపై ఆయన విచారణ చేపట్టారు. నివేదిక తారుమారు చేయడానికి గల కారణాలేమిటని ఆమెను ప్రశ్నించారు. గాయాలతో ఆస్పత్రికి వచ్చిన రఘురామకు చికిత్స చేశారా అని అడిగారు.
గాయాలు లేవని ఎలా నిర్ధారించారు, ఎందుకు నిర్ధారించారని ప్రభావతిని ప్రశ్నించారు. అప్పట్లో పోలీసుల దాడిలో గాయపడ్డ రఘురామకృష్ణరాజును (Raghu Rama Krishnam Raju) గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటి ఆస్పత్రి పర్యవేక్షుకురాలిగా ఉన్న డాక్టర్ ప్రభావతి ఎలాంటి గాయాలు లేవని నివేదికలు ఇచ్చారు.
దీంతో ఇప్పుడు ప్రభావతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు ప్రయత్నించగా ఆమె గత కొన్నాళ్లుగా తప్పించుకు తిరుగుతున్నారు. సుప్రీం కోర్టుకు వెళ్లి అరెస్ట్ విషయంలో కొంత వెసులుబాటు కల్పించుకున్నారు. పోలీసుల (Police) విచారణకు సహకరించాలని ప్రభావతికి సుప్రీంకోర్టు సూచించింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం ఆమె ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. రఘురామ హత్య వెనక ఉన్న కుట్ర గురించి మరిన్ని విషయాలను రాబట్టేందుకు పోలీసులు యత్నించారు.
మాజీ ఎంపీ, శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకు సీఐడీ కస్టడీలో చిత్రహింసల కేసులో జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతికి గతంలో హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది.
'విచారణకు ప్రభావతి హాజరుకావాలి' - రఘురామ కేసులో సుప్రీంకోర్టు
సీఐడీ కస్టడీలో తనను తీవ్రంగా వేధించారంటూ గుంటూరులోని నగరంపాలెం పోలీసులకు గతంలో రఘురామ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ప్రభావతిని ఏ5గా పేర్కొన్నారు. జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఆమె తప్పుడు నివేదిక ఇచ్చారంటూ రఘురామ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం విదితమే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభావతిని ఒంగోలు ఎస్పీ విచారిస్తున్నారు.
రఘురామ కేసులో జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్ పిటిషన్ కొట్టివేత