Fire Accident at Sitara Center in Vijayawada : విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యాధరపురంలోని కశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ లో జరిగిన అగ్ని ప్రమాదం లక్షల రూపాయల ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలు అదుపు చేశారు. ప్రమాదానికి కారణాలేంటన్నది స్పష్టంగా తెలియడం లేదు. విజయవాడ వెస్ట్ జోన్ ACP దుర్గారావు, అగ్నిమాపక శాఖ అధికారి శంకరరావు ఘటనాస్థలిని పరిశీలించారు. సమగ్ర విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.
ఎగ్జిబిషన్‌లో భాగంగా ఏర్పాటు చేసిన దుకాణాలు కాలి దగ్గమయ్యాయి. ప్రధానంగా దుస్తులు, అలంకరణ సామాగ్రి, ఇతర ఆట వస్తువులు కాలిబుడిద అయ్యాయి. రూపాయి రూపాయి కూడబెట్టి పెట్టుబడిగా పెడితే సామగ్రి మొత్తం బుగ్గిపాలైందని దుకాణదారులు వాపోతున్నారు. కళ్లెదుటే కాలిపోయిన దుకాణాలు చూసి దిగాలుపడిపోయారు.
ఘటనపై హోంమంత్రి ఆరా : ఈ అగ్నిప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. ప్రాణ, ఆస్తి నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్యాస్ సిలిండర్ పేలుడుతో వ్యాపించిన మంటలను అదుపులోకి తెచ్చినట్లు పోలీస్, అగ్నిమాపక అధికారులు వెల్లడించారు. ఎండలు మొదలైన నేపథ్యంలో ప్రమాదాలకు ఆస్కారం లేకుండా వ్యాపారులు బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. విజయవాడ వెస్ట్ డివిజన్ ఏసీపీ ఎన్ఎస్వీకే దుర్గారావుతో మంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి దుకాణాలు దగ్ధమైనట్లు దుర్గారావు వివరించారు.
106 కిలో మీటర్లు దూరం - 6 నిమిషాల్లో ప్రాణాలు కాపాడిన పోలీసులు