Intercaste Marriage Problems Legal Advice : లవ్ మ్యారేజ్లు కామన్ అయిపోయాయి. చాలా మంది కాలేజీలో చదువుతున్న సమయంలోనో లేదా ఆఫీస్‌లో సహోద్యోగితో ప్రేమలో పడిపోతున్నారు. ఆ తర్వాత 'నీవు లేక నేను లేను, మన కులాలు, మతాలు, ప్రాంతాలు వేరైనా ఇద్దరం కలకాలం కలిసే ఉందాం, అవసరమైతే మన ప్రేమ కోసం ఈ ప్రపంచాన్నే ఎదిరిద్దాం' అనే రేంజ్లో సినిమా డైలాగులు చెప్పుకుని ప్రేమలో మునిగి తేలిపోతారు. ఆ తర్వాత కొంతమంది పెద్దలను ఒప్పించి మ్యారేజ్ చేసుకుంటే, మరికొందరు ఎదిరించి ప్రేమ వివాహం చేసుకోవడం చూస్తున్నాం. అయితే, ఇలా ప్రేమ వివాహం చేసుకున్న ఓ అమ్మాయి ఆ తర్వాత అనుకోని కష్టాలు ఎదుర్కొంటోంది. ఇంతకీ ఆమె సమస్య ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇదీ సమస్య :
'మాది లవ్ మ్యారేజ్. వివాహమై మూడేళ్లు అవుతోంది. మా ఆయన మొదట్లో తనకు కులమతాల పట్టింపు లేదనేవారు. కానీ, ఈ మధ్య ఆయనతోపాటు అత్తమామలూ కులం పేరుతో నన్ను హేళన చేస్తున్నారు. అందరూ అలా మాట్లాడుతుంటే నాకు చాలా అవమానంగా ఉంది. ఇంట్లో అందరూ చదువుకున్నవారే అయినా ఇలా ప్రవర్తిస్తున్నారు. కేసు పెడితే పరువు పోతుందని ఆలోచిస్తున్నాను. నాకు మరో మార్గం ఏదైనా ఉందా?' అని న్యాయనిపుణుల సలహా కోరుతోంది. ఈ ప్రాబ్లమ్‌కు ప్రముఖ న్యాయవాది జి.వరలక్ష్మి ఎలాంటి సమాధానం ఇస్తున్నారో ఇప్పుడు చూద్దాం.
ఆ టైమ్‌లో పట్టించుకోరు :
లవ్ మ్యారేజ్లు ఫేయిల్ కావడానికి సగం కారణాలు- కులాలు వేరుకావడం, ఒకరికి డబ్బులు ఎక్కువగా ఉండడం, మరొకరికి తక్కువగా ఉండడమే! అయితే, చాలా మంది ప్రేమిస్తున్న సమయంలో ఇవేవీ పెద్దగా పట్టించుకోరు. మా ప్రేమకు ఇలాంటి బేధాలు లేవని భావిస్తుంటారు. అయితే, ప్రేమించేటప్పుడు గుర్తుకురాని అసమానతలు మ్యారేజ్ అయ్యాక గుర్తుకొచ్చి గొడవలకు దారితీస్తుంది.
'నా నగలు వీళ్లు తాకట్టు పెట్టారు - వాటిని మా పుట్టింటి వాళ్లు విడిపించాలట!' - ఏం చేయాలి?
బంధమూ విచ్ఛిన్నం కావొచ్చు!
వివాహ బంధాన్ని కాపాడుకోవడానికి ఇద్దరి మధ్య అన్యోన్యత, అనురాగం, సహకారం, అవగాహన, సర్దుబాటు వంటివి ఉండాలి. ఒకవేళ మీరు కేసు పెడితే పరువు మాత్రమే కాదు- మీ బంధమూ విచ్ఛిన్నం కావొచ్చు. అలాగని మిమ్మల్ని సూటిపోటి మాటలతో బాధపడమని, అవహేళనలు భరించమని చెప్పలేను. ఈ విషయంలో మీకు గృహహింస చట్టం యూజ్ అవుతుంది.
"గృహహింస చట్టం ప్రకారం మానసిక హింసను కూడా పరిగణిస్తారు. అంటే డబ్బు తేలేదనో, అందంగా లేవనో, కులం తక్కువనో అవహేళన చేయడం, పిల్లలు పుట్టలేదనో, బాధపెట్టడం వంటివన్నీ ఈ తరహానే. ఇలాంటి బాధల్ని నాలుగు గోడల మధ్య మౌనంగా భరిస్తున్న మహిళల కోసమే ఈ చట్టం తెచ్చారు." -జి.వరలక్ష్మి, ప్రముఖ న్యాయవాది
ఆలోచించి నిర్ణయం తీసుకోండి!
ఫస్ట్ మీరు మధ్యవర్తులు, మీడియేషన్ సెంటర్లూ లేదా ఫ్యామిలీ కౌన్సెలర్‌లను కలవండి. ఫలితం లేకపోతే డీవీసీ యాక్ట్‌లోని సెక్షన్ 12 ప్రకారం ముందుగా ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గర ఫిర్యాదు చేయండి. అప్పుడు వారు మీ కుటుంబ సభ్యులను పిలిచి కౌన్సెలింగ్ చేస్తారు. అక్కడ కూడా మీ సమస్య పరిష్కారం కాకపోతే దాన్ని కోర్టుకి రిఫర్ చేస్తారు. ముందుగా ఒకసారి భర్తకి మీ ఆవేదన చెప్పి చూడండి. ఆయన ద్వారా మిగిలిన కుటుంబ సభ్యులు మారే అవకాశం ఉంటుంది. కాస్త ఓపికగా ఆలోచించి నిర్ణయం తీసుకోమని జి.వరలక్ష్మి సూచిస్తున్నారు.
Note: ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. న్యాయవాదుల సలహాలు, చట్ట ప్రకారం పాటించాల్సిన సూచనల ప్రకారమే ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత న్యాయవాది సలహాలు తీసుకోవడమే మంచిది.
'పెళ్లై ఇద్దరు పిల్లలున్నా.. అమ్మాయిలతో తిరుగుతున్నాడు' - ఏం చేయాలి?