Online Gaming Cyber Crime : ఆన్‌లైన్ గేమ్స్ చిన్నారులకు శాపంగా మారుతుంది. ఆటలకు బానిసలుగా మారిన వారు గేమ్ అప్‌గ్రేడ్ కోసం నగదు బదిలీ చేస్తున్నారు. ఈ యాప్‌ల మాటున సైబర్ నేరగాళ్లు నగదు దోచుకుంటున్నారు. మొబైల్‌ను పెద్దల కంటే పిల్లలే ఎక్కువగా వినియోగిస్తున్నారు. వాటి ఫీచర్లు తల్లిదండ్రుల కంటే వారికే తెలుస్తున్నాయి. వీటి వాడకంలో ఎక్కువ కుటుంబాల్లో వారిపైనే ఆధారపడుతున్నారు. అంతిమంగా ఇది చిన్నారులు సెల్ఫోన్లలోని ఆటలకు బానిసలుగా మారేందుకు కారణమవుతోంది.
ఇది చిన్నారుల్లో విపరీత మానసిక స్థితికి దారితీస్తోంది. దీనికి బానిసలు కావడాన్ని మానసిక స్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించడమే ఇందుకు నిదర్శనం. కొవిడ్ నుంచి మొదలైన ఈ పరిస్థితులు నానాటికీ తీవ్రమవుతున్నాయి. ఎదిగే వయసులో ఇవి చిట్టి మెదళ్లపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని సైకియాట్రిస్టులు అంటున్నారు. మద్యం తీసుకున్నప్పుడు మనిషి మెదడులో ఎటువంటి రసాయన మార్పులు సంభవిస్తాయో ఆటలకు బానిసలైన వారిలోనూ దాదాపు ఇలాంటి మార్పులే కనిపిస్తాయని చెబుతున్నారు.
ఆత్మన్యూనతాభావం, ఆత్మవిశ్వాసస్థాయి బాగా తక్కువగా ఉన్న పిల్లలు మొబైల్ గేమ్స్‌ను అలవాటు చేసుకుంటున్నారు. ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడేందుకూ వీటిని ఆశ్రయిస్తున్నారు. సెల్‌ఫోన్ యాప్స్‌ను దాచే లాంఛర్లు చాలా ఉన్నాయి. వీటిని ఉపయోగించి పెద్దలకు తెలియకుండా గేమ్ యాప్స్‌ను దాచి, అవసరమైనప్పుడు అన్‌హైడ్ చేసి వాటిని ఆడుతున్నారు. కొన్ని రకాల యాప్ లాకర్లు ఉంటాయి. వాటిని ఉపయోగించి లాక్ చేస్తున్నారు.
Kids Addicted to Online Games : ఆన్‌లైన్ గేమ్స్‌లో తేలికగా ఉన్న అంచెలు ఆడిన తర్వాత మరో స్థాయికి వెళ్లాలంటే నగదు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తదుపరి లెవల్స్‌కు వెళ్లాలన్న ఆత్రుతలో తెలియకుండానే మొబైల్‌లోని యూపీఐను యాక్టివేట్ చేస్తున్నారు. ఫలితంగా ఖాతా నుంచి సొమ్ము బదిలీ అవుతోంది. ఇలా కొద్దిగా మొదలై పెద్ద మొత్తంలో డబ్బు పోతోందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు చెబుతున్నారు. అందుకే బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన నంబర్ ఉన్న ఫోన్‌ను పిల్లలకు ఇవ్వకూడదని దీని వల్ల ఆ అకౌంట్ నుంచి నగదు పోయే అవకాశాలు ఉన్నాయని హెచ్చరిస్తున్నారు.
"కొన్ని రకాల గేమ్స్ చిన్నపిల్లలకు వ్యసనంగా మారుతుంది. ఈ గేమ్స్ తేలికగా లెవల్స్ ఆడాక వేరే లెవల్‌కి వెళ్లాలంటే డబ్బులు చెల్లించాలని చూపిస్తుంది. తదుపరి లెవల్స్‌కు వెళ్లాలన్న ఆత్రుతలో తెలియకుండానే మొబైల్‌లోని యూపీఐను యాక్టివేట్ చేస్తున్నారు. ఫలితంగా ఖాతా నుంచి నగదు బదిలీ అవుతోంది. ఇలా కొద్ది మొత్తంతో మొదలై. పెద్ద మొత్తంలో పోతోంది. బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన నంబర్ ఉన్న ఫోన్‌ను పిల్లలకు ఇవ్వకూడదు." - సాయి సతీష్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు
మరోవైపు తల్లిదండ్రులతో సరైన సంబంధాలు లేకపోవడం వల్ల పిల్లలు కొత్తదారులు వెతుక్కుంటున్నారని మానసిక వైద్యులు చెబుతున్నారు. వాస్తవంలో కాకుండా ఊహాలోకంలో బతికేే పిల్లలు ఆన్‌లైన్ గేమ్స్ పట్ల త్వరగా ఆకర్షితులవుతున్నారని పేర్కొంటున్నారు. పిల్లలు నాలుగు గోడల మధ్య కాకుండా తమ పర్యవేక్షణలో ఉండేలా చూసుకోవాలని వివరిస్తున్నారు. వీటి నుంచి చిన్నారుల దృష్టిని మళ్లించి శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందించే ఔట్‌డోర్ గేమ్స్ ఆడించాలని వారు తెలియజేస్తున్నారు.
చొక్కాపై ఆత్మహత్య కారకులు - ఆన్‌లైన్ భూతానికి మరో వ్యక్తి బలి
ఆన్లైన్లో రూ.87లక్షలు పోగొట్టుకున్న ఘటనలో.. పోలీసులకు తీగ దొరికింది..!