HAJ Bhavan In Vijayawada:ముస్లింలు తమ జీవితంలో ఒక్కసారైనా హజ్, ఉమ్రా యాత్ర చేయాలని మక్కాను సందర్శించాలని భావిస్తారు. అయితే వారి యాత్ర సులభతరం కావడం కోసం రాష్ట్రం నుంచి నేరుగా మక్కాకు వెళ్లేందుకు 2018లో గత టీడీపీ హయాంలో విజయవాడలో హజ్ భవన నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేసారు. కానీ 2019 ఎన్నికల అనంతరం అధికారం చేపట్టిన వైఎస్సార్సీపీ దీన్ని పూర్తిగా విస్మరించింది. దాంతో పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముస్లిం సోదరుల్లో మళ్లీ దీనిపై ఆశలు చిగురిస్తున్నాయి.
విజయవాడలో హజ్ భవనం: ప్రతి ముస్లిం తన జీవితంలో కచ్చితంగా అనుసరించాల్సిన ఐదు నియమాల్లో హజ్ యాత్ర ఒకటి. ఇస్లాం ధర్మంలో ఒక్క సారి హజ్ దర్శనం చేయడం తప్పని సరి. బక్రీద్ నెలలో చేసే యాత్రను హజ్ అని, సాధారణ రోజుల్లో చేసే యాత్రను ఉమ్రా అని అంటారు. ఏడాదికి ఒకసారి ఈ హజ్ యాత్ర ఉంటుంది. దీని కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్ నగరంలో హజ్‌భవనాన్ని నిర్మించారు. హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలు దీన్ని వినియోగించుకునే వారు. రాష్ట్ర విభజన అనంతరం కడపలో హజ్‌భవనం నిర్మాణం చేపట్టారు.విజయవాడలో సైతం మరో భవనాన్ని నిర్మించాలనే ముస్లిం సంఘాల విజ్ఞప్తికి అప్పట్లో చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. అందుకు అనుగుణంగా 2018లో మే 12న విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కుమ్మరిపాలెం సమీపంలో 80 కోట్ల రూపాయలతో హజ్‌భవనాన్ని నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. దీనికి స్థలాన్ని కేటాయించి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. అక్కడే మసీదుతోపాటు షాదీఖానా కూడా నిర్మించాలనుకున్నారు. దీనితో త్వరలోనే హజ్ భవనం అందుబాటులోకి వస్తుందని మైనార్టీ వర్గాలు ఆశలు పెట్టుకున్నారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వారి ఆశలపై నీళ్లు చల్లింది. దీన్ని వారు పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముస్లిం సోదరుల్లో మళ్లీ ఆశలు తొణికిసలాడుతున్నాయి.
హజ్ యాత్రపై కేంద్రం కీలక నిర్ణయం
గత ప్రభుత్వ నిర్లక్ష్యం: హజ్‌భవన నిర్మాణ పనులు చేపట్టాలని గత పాలకులకు మైనార్టీ వర్గాలు ఎన్ని సార్లు విన్నవించుకున్న నిధులు లేవని దాటవేశారు. హజ్ యాత్ర సమయంలో గన్నవరం, నంబూరు దగ్గర యాత్రికుల కోసం తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు. అక్కడ సరైన సదుపాయాలు లేక యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయితే ప్రస్తుతం భవనానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రిగా ఉన్న నేపథ్యంలో హజ్ భవన నిర్మాణం త్వరగా పూర్తి చేస్తారని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి హజ్ హోస్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
హజ్ హోస్ భవనం అందుబాటులోకి వస్తే అక్కడే మైనారిటీ ఆర్థిక సహకార సంస్థ, వక్ఫ్‌బోర్డు, హజ్ కమిటీతో పాటు ఇతర మైనార్టీ వర్గాలకు సంబంధించిన కార్యాలయాలన్నీ అందులోనే నిర్వహించుకోవచ్చని ముస్లింలు చెబుతున్నారు.
''చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఇక్కడ సంకుస్థాపన చేశారు. అంతే గాక ఇక్కడ మసీదుతో సహా షాదీఖానా కూడా నిర్మించాలనుకున్నారు. దాంతో నిర్మాణం జరుగుతుందని అంతా అశించాం. కానీ తరువాత వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టలేదు. అందువల్ల మేమంతా తీవ్ర ఇబ్బందులు పడపతున్నాం. ఇప్పటికైనా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీనిపై స్పందించి త్వరితగతిన నిర్మాణాన్ని చేపడుతుందని ఆశిస్తున్నాం''-యూసఫ్, విజయవాడ
hajj yatra 2023: గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హజ్‌యాత్ర ప్రారంభం .. తరలివెళ్తున్న యాత్రికులు
చర్చిలు, పోలీస్ స్టేషన్లపై ఉగ్రదాడి- 15మందికి పైగా పోలీసులు, పౌరులు మృతి- ఆరుగురు ఉగ్రవాదులు హతం