Bharat Ratna PV Narasimha Rao Reactions : తెలంగాణ ముద్దుబిడ్డ, భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యన్నత పురస్కారం దక్కింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ఎక్స్ (ట్విటర్) వేదికగా ప్రకటించారు. రాజనీతిజ్ఞుడు పీవీ నరసింహారావు ఈ దేశానికి అందించిన సేవలు అపారమని కొనియాడారు. దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ఆయన నాయకత్వం బలమైన పునాది వేసిందని తెలిపారు. పీవీ హయాంలో ప్రపంచ మార్కెట్‌ను భారత్ ఆకర్షించిందని ట్వీట్ చేశారు. ఆయన పాలనలో ఆర్థిక వృద్ధికి కొత్త శకం మొదలైందని ట్వీట్‌లో పేర్కొన్నారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆలస్యమైనా పీవీకి దేశ అత్యున్నత పౌర పురస్కారం దక్కడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని అసెంబ్లీలో పేర్కొన్నారు. ప్రఖర జాతీయవాది, రాజనీతిజ్ఞుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, పీవీకి భారతరత్నకు ఎంపికవడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దూరదృష్టి గల నాయకుడిగా భారతదేశానికి వివిధ హోదాల్లో ఆయన చేసిన సేవలకు సరైన గుర్తింపు లభించిందని పేర్కొన్నారు. చాణక్యుడిగా రాజకీయ చతురతతో దేశాన్ని ముందుకు నడిపించడంతోపాటు,రచయితగా, సాహితీవేత్తగా ప్రతి అడుగులో ఆయన జీవితం మనందరికీ ఆదర్శనీయమని కొనియాడారు.
KCR Reaction On PV Bharat Ratna : పీవీకి భారతరత్న దక్కడం పట్ల తెలుగు రాష్ట్రాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పురస్కారం తెలంగాణ ప్రజలకు దక్కిన గౌరవం అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. పీవీకి భారతరత్న ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసిందని గుర్తు చేశారు. తమ విజ్ఞప్తిని గౌరవించి ఆయనకు భారతరత్న ఇవ్వడం సంతోషకరమని కేంద్ర ప్రభుత్వానికి కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
సంస్కరణల రుషికి భారతరత్న - అప్పుల భారతాన్ని ప్రగతివైపు నడిపిన 'పీవీ'