Hyderabad Lady Doctor Died In Tungabhadra River in Karnataka : కర్ణాటక రాష్ట్రంలోని హంపీలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా స్నేహితులో కలసి విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కి చెందిన యువ వైద్యురాలు తుంగభద్ర నదిలో ఈత కొట్టాలనే ఉద్దేశ్యంతో నదిలో దూకడంతో కొట్టుకుపోయింది. బుధవారం ఈ ఘటన జరిగింది. తుంగభద్ర నదిలో నుంచి రెస్క్యూ టీమ్ ఆమె మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో, కుటుంబ సభ్యులు,స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.
సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి నదిలో దూకిన డాక్టర్ : కర్ణాటక పోలీసులు తెలిపిన విరరాల ప్రకారం, డాక్టర్ అనన్యరావు, మరో ఇద్దరు స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి హంపీ టూర్‌కి వచ్చారని, స్మారకాలను వీక్షించి మంగళవారం రాత్రి సణాపుర గ్రామంలోని ఓ అతిథి గృహంలో బస చేశారని తెలిపారు. బుధవారం మధ్యాహ్నం ఈత కొట్టడానికి తుంగభద్ర నది వద్దకు వెళ్లారని, అనంతరం, సుమారు 25 అడుగుల ఎత్తు గల బండరాయి నుంచి అనన్వరావు నీటిలో దూకి ఈత కొట్టాలనుకుందని, దీంతో రాళ్ల పై నుంచి నీటిలో దూకిందని తెలిపారు. ఆ సమయంలో నీటి ఉధృతికి ఎక్కువగా ఉండటంతో కొట్టుకుపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారని అన్నారు.
సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ : అనన్యరావు నదిలో కొట్టుకుపోయిన విషయం తెలుసుకున్న గంగావతి గ్రామీణ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రదేశంలో తుంగభద్ర రాతి గుహల్లో ప్రవహిస్తూ ఉంటుంది. యువతి ఈ గుహల్లో చిక్కుకు పోయింటారని పోలీసులు అనుమానించారు. స్థానిక గజ ఈతగాళ్లు, అగ్నిమాపకదళం సాయంత్రం వరకు ప్రయత్నించినా ఆమె జాడ కనిపించలేదు. ఈ రోజు ఉదయం గజ ఈతగాళ్లు అనన్వరావు మృతదేహాన్ని బయటకు తీశారు. దీంతో, అనన్య కుటుంబ సభ్యులు, స్నేహితులు బోరున విలపించారు. డాక్టర్ నీటిలోకి దూకుతున్న దృశ్యాలు ఆమె స్నేహితురాలి మొబైల్ ఫోన్‌లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం అనన్య నదిలో దూకిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.