Bandi Sanjay Letter to CM Revanth Reddy : సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బహిరంగ లేఖ(Bandi Sanjay Letter) రాశారు. గత 27 రోజులుగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఆసాములు, కార్మికులు చేస్తున్న సమ్మె అంశాన్ని బండి సంజయ్ లేఖలో ప్రస్తావించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం ప్రభుత్వమేనన్నారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన గత నాలుగు నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి సంజయ్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన పాత బకాయిలు రూ.270 కోట్లు ఇంతవరకు చెల్లించలేదని, అలాగే కొత్త ఆర్డర్లు కూడా ఇవ్వడం లేదన్నారు. ఫలితంగా వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి పని చేస్తున్న దాదాపు 20 వేల మంది పవర్ లూమ్, అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అప్పులు చేస్తూ ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ లేఖలో ఆందోళన చెందారు. ప్రభుత్వ బకాయిలు చెల్లించాలని, కొత్త ఆర్డర్లతో వస్త్ర పరిశ్రమ(Handloom Workers)ను ఆదుకోవాలని గత 27 రోజులుగా చేనేత కార్మికులు సమ్మె చేస్తున్నారని గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో అసహనం చెందారు.
"గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టి కచ్చితంగా వాటిని నేయాలంటూ ఆసాములు, యజమానులపై ఒత్తిడి చేసి పాత వ్యాపారులను బంద్ చేయించారు. ఆ తర్వాత మాస్టర్ వీవర్స్ పేరుతో పెద్ద యజమానులకుబతుకమ్మ చీరలఉత్పత్తి, ఆర్డర్లు ఇచ్చి చిన్న యజమానులు, ఆసాములను కూలీలుగా మార్చారు. బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిన యజమానులకు సైతం ప్రభుత్వం నుంచి సక్రమంగా పేమెంట్లు రాకపోవడంతో రూ.270 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయి. దీంతో వ్యాపారాలు చేయడానికి డబ్బుల్లేక, కొత్త ఆర్డర్లు లేక యజమానులు వస్త్ర పరిశ్రమను బంద్ చేశారు." -బండి సంజయ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి