Bandi Sanjay Nomination For Karimnagar MP Seat : తెలంగాణలో లోక్‌సభ నామినేషన్ల ఘట్టం తుదిదశకు చేరుకుంది. ఇవాళ ఒక్కరోజే గడువు ఉండటంతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధిగా బండి సంజయ్ రెండోసారి నామినేషన్ వేశారు. ఆనవాయితీ ప్రకారం తన తల్లి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్న ఆయన నేరుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి చేరుకున్న బండి సంజయ్ నామపత్రాలు దాఖలు చేశారు.
Lok Sabha Polls Nominations in Telangana 2024 : నామినేషన్ అనంతరం బండి సంజయ్ నేరుగా ఎస్‌ఆర్‌ఆర్ కళాశాల వద్దకు చేరుకొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మూడోసారి నరేంద్ర మోదీని ప్రధాని చేయాలన్నలక్ష్యంతో పని చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే గుజరాత్‌లో ఏకగ్రీవంతో బోణీ అయిందని, మరో 399 కోసమే మీరు కష్టపడాలని బండి సంజయ్ కోరారు.
"పేదలకు సంక్షేమ ఫలాలు అందాలంటే ప్రధానిగా నరేంద్ర మరోసారి కావాలి. అందుకోసం మీరందరూ కష్టపడాలి. కరీంనగర్ ప్రజలు ఆలోచించండి బీజేపీ కావాలా, కాంగ్రెస్, బీఆర్ఎస్ కావాలా. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఒకే నాణానికి బొమ్మ, బొరుసు లాంటి వాళ్లు. కరోనా సమయంలో ఇక్కడి ప్రజల కోసం ఎన్నో సేవలు చేశాను. అందుకే ఆలోచించి ప్రజలు ఓటు వేయండి."- బండి సంజయ్, కరీంనగర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్థి