How to Make Mokkajonna Garelu: మనలో చాలా మందికి వేడివేడి గారెలంటే ఇష్టం. పండగలైనా, శుభకార్యాలైనా, చుట్టాలు వచ్చినప్పుడైనా కరకరలాడే గారెలు చేసుకుని తింటుంటాం. అయితే, దాదాపు అందరూ మినప్పప్పు, అలసందలు, పెసరపప్పుతో గారెలు చేసుకుని తినే ఉంటారు. కానీ, మొక్కజొన్నలతో చేసిన గారెలు తినడం తక్కువ. ఈ గారెలు కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. పైగా చేయడం కూడా చాలా ఈజీ. తక్కువ పదార్థాలతో, తక్కువ టైమ్‌లోనే చాలా రుచికరంగా చేసుకోవచ్చు. మరి ఈ గారెలు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
- మొక్కజొన్న గింజలు - 2 కప్పులు
- పచ్చిమిర్చి - 2
- ఎండుమిర్చి - 2
- అల్లం ముక్కలు - అంగుళం
- పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు - 4
- జీలకర్ర - అర టీ స్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- శనగపిండి -1 టేబుల్ స్పూన్
- బియ్యప్పిండి - 1 టేబుల్ స్పూన్
- కరివేపాకు - 2 రెమ్మలు
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- పుదీనా తరుగు - కొద్దిగా
- ఉల్లిపాయ - 1
- ధనియాల పొడి - అర టీ స్పూన్
- గరం మసాలా - పావు టీ స్పూన్
- చాట్ మసాలా - పావు టీ స్పూన్
- పసుపు - పావు టీ స్పూన్
తయారీ విధానం:
- మొక్కజొన్న గింజలను నానబెట్టుకోవాలి. అయితే మీరు తీసుకునే గింజలు గట్టిగా ఉంటే ఓ రెండు గంటలు నానబెట్టాలి. ఒకవేళ లేత గింజలు తీసుకుంటే 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది.
- ఈ లోపు కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకోవాలి.
- గింజలు నానిన తర్వాత నీళ్లు లేకుండా వడకట్టి మిక్సీజార్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న గింజలు గట్టిగా ఉంటే చెంచాడు నీళ్లు వేసుకోవచ్చు. లేతవి అయితే నీళ్లు అవసరం లేకుండా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఓ బౌల్లోకి తీసుకోవాలి. అందులోకి శనగపిండి, బియ్యప్పిండి వేసి కలపాలి.
- అనంతరం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఆ తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా, పసుపు వేసి మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
- ఈ పిండిని మొత్తం కలిపిన తర్వాత ఉప్పు, కారం సరి చూసుకోవాలి. ఒకవేళ ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి.
- ఇప్పుడు పిండిని కొద్దిగా అరచేతిలో తీసుకుని గారెలుగా వత్తుకుని కాగుతున్న నూనెలో వేసుకోవాలి.
- మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గారెలను రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి.
- ఇలా పిండి మొత్తాన్ని గారెలుగా చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ అద్దిరిపోతాయి. నచ్చితే మీరూ ఇంట్లో ఓసారి ట్రై చేయండి.
క్రిస్పీ అండ్ టేస్టీ "తోటకూర గారెలు" - ఇలా చేశారంటే టేస్ట్ అదుర్స్!
పాకం లేకుండానే "కమ్మటి అరిసెలు" ఇలా చేసుకోండి - టేస్ట్ అద్దిరిపోతాయి!
ఇంట్రస్టింగ్: డైలీ స్వీట్ కార్న్ తింటే - ఈ ఆరోగ్య సమస్యలన్నీ మటుమాయం!