Thummilla Water Dispute Between MLA and AICC Secretary : తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకానికి నీటి విడుదల వివాదానికి దారితీసింది. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం తుమ్మిళ్ల వద్ద తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పంపు హౌజ్‌లో అలంపూర్ శాసనసభ్యుడు విజయుడు మోటార్లను ఆన్ చేసి కాల్వలకు నీటి విడుదల చేశారు.
ఎమ్మెల్యే వెళ్లిన కొద్ది సేపటికి అక్కడకు చేరుకున్న ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, నీటి విడుదల సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పైప్ లైన్ ద్వారా 9 కిలోమీటర్లు ప్రయాణించి నీళ్లు 22వ డిస్టిబ్యూటరీ వద్ద ఆర్డీఎస్ కాల్వలకు చేరుకోవాల్సి ఉంది. ఉదయం ఏడున్నరకు మోటార్లు ఆన్ చేసిన ఎమ్మెల్యే తనగల గ్రామం ఆర్డీఎస్ 22డిస్టిబ్యూటరీ వద్దకు చేరుకున్నారు.
"ఇక్కడు భూములు ఎండిపోతుంటే రైతులు బాధ చూడలేక, కలెక్టర్ సహా నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాతే నేను నీళ్లు విడుదల చేశాను. కానీ వెంటనే సంపత్‌కుమార్ వచ్చి ఆఫ్ చేశారు. నేను ఉదయం 07:15 గంటలకు మోటర్లు ఆన్ చేసి వచ్చాక, వాళ్లు వెళ్లి ఆపడమేంటసలు."-విజయుడు, అలంపూర్ ఎమ్మెల్యే
స్థానిక ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి మధ్య వివాదం :రెండు, మూడు గంటలు దాటినా నీళ్లు రాలేదు. దీనిపై ఎమ్మెల్యే విజయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను ప్రారంభించిన మోటార్లను సంపత్ కుమార్ ఉద్దేశపూర్వకంగానే ఆపేశారని ఆరోపించారు. నీళ్లు లేక తుమ్మిళ్ల ఆయకట్టు కింద పంటలు ఎండిపోతున్నాయని, రైతుల ఆవేదన చూడలేక కలెక్టర్ సహా నీటిపారుదల శాఖ అధికారులతో మాట్లాడిన తర్వాతే తాను నీళ్లు విడుదల చేశానని చెప్పారు.
ఒకసారి మోటార్లు ఆన్ చేసిన తర్వాత ఆపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ప్రోటోకాల్ ప్రకారం సంపత్ కుమార్ నీళ్లు విడుదల చేస్తారని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ మధ్య వివాదం చోటుచేసుకుంది. నీళ్లు ఆర్డీఎస్ కాల్వకు చేరే వరకూ అక్కడి నుంచి కదిలేదిలేదంటూ ఎమ్మెల్యే విజేయుడు నిరసనకు దిగారు.