YS Sharmila Targets Jagan in Mumbai Actress Issue:రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జత్వానీ, గుడ్లవల్లేరు కళాశాల ఘటనలపై కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి స్పందిస్తూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌పై షర్మిల సూటి ప్రశ్నలతో దాడి చేశారు. ఆమె కేసు పెట్టబోతే అక్రమంగా నిర్బంధించి తొక్కి పడేశారని అప్పటి జగన్ సర్కార్ తీరుపై ధ్వజమెత్తారు.
జగన్ ఎందుకు ఆలోచించలేదు? : వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్, జగన్ మధ్య సాన్నిహిత్యాన్ని గొప్పగా చెప్పుకొన్నారని, జిందాల్‌కు ఎందుకు ఇన్ని కోట్ల రూపాయల ఆస్తి కట్టబెట్టారో జగన్ సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చెశారు. ముంబై నటి కాదంబరి జత్వానీ ఓ మహిళ యాక్టర్ అని, ఆమెను మానసికంగా వేధించారని ఆరోపించారు. ఒక మహిళను అడ్డుకునేందుకు ఇంత నీచంగా మారాలా? అని ప్రశ్నించారు. ఆమె ఒక మహిళా డాక్టర్ అని యాక్టింగ్ ఫీల్డ్‌లోకి వచ్చి ఎదగాలని భావించిన మహిళను మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాదంబరి జత్వానీ కేసు పెట్టబోతే అక్రమంగా నిర్బంధించి తొక్కి పడేశారని ఆరోపించారు. ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన మహిళను ఇక్కడికి తీసుకొచ్చి అరెస్ట్ చేయడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. జగన్‌కు తెలియకుండానే అప్పటి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తారా? ఇద్దరు కుమార్తెలున్న జగన్, జత్వానీకి జరిగిన అన్యాయంపై ఎందుకు ఆలోచించలేదు? అని సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఆయన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాదంబరి జత్వానీకి అండగా ఉండి పోరాటం చేసేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు.
హిడెన్ కెమెరాలు లేవు : గుడ్లవల్లేరు కళాశాలలో హిడెన్ కెమెరాల ఘటన ఫేక్ న్యూస్ అని భావిస్తున్నామని షర్మిల వెల్లడించారు. కళాశాలలో 300 కెమెరాలు పెట్టారని చెబుతున్నా, ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఒకవేళ షవర్‌లో పెట్టి ఉంటే నీళ్లు పడితే బ్లర్ అవుతుందని అని అన్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున తమ టీమ్స్ వెళ్లి సర్వే చేస్తే అంతా ఫేక్ అని తేలిందని తెలిపారు. ఒకవేళ కెమెరాలు పెట్టినట్లు ఎవరైనా నిజాలు బయటికి తీస్తే బాధితుల తరఫున పోరాడతానని ఆమె హామీ ఇచ్చారు.
స్టీల్ ప్లాంటు ఏర్పాటు అంటూ జగన్ హడావుడి : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు ప్రాంతంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు పేరిట హడావుడి చేసిన జగన్, సజ్జన్ జిందాల్ సినీ నటిని అక్రమంగా అరెస్టు చేయడంపైనే దృష్టి పెట్టారని మండిపడ్డారు. కానీ స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై వాళ్లద్దరికీ ధ్యాసే లేదని విమర్శించారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ కడపలో కలెక్టర్ శివశంకర్‌ను కలిసి షర్మిల వినతి పత్రం సమర్పించారు.