AP Election Results 2024 :ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అధికార పీఠం ఎవరకి దక్కబోతుంది? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దర్ని కదిలించినా ఇదే ప్రశ్న. నరాలు తెగే ఉత్కంఠతో ఎప్పుడెప్పుడు ఫలితాలు వెలువడతాయా అని ప్రతి ఒక్కరు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణకు మరికాసేపట్లో తెరపడనుంది.ఈవీఎం పెట్టెల్లో నిక్షిప్తమైన ఓటర్ల తీర్పు మరికాసేపట్లో వెలువడనుంది.
మరి కొద్ది గంటల్లో ఉత్కంఠకు తెర : ఆంధ్రప్రదేశ్‌లోని 175 శాసనసభ స్థానాలు, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాల లెక్కింపు ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 33 చోట్ల 401 కౌంటింగ్ హాళ్లను సిద్ధం చేశారు. 25,000ల మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో భాగం కానున్నారు. 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోటీ పడిన 454 మంది, అలాగే 175 శాసనసభ స్థానాలకు పోటీపడిన 2387 మందిలో ఎవరు విజేతలుగా నిలువనున్నారనే ఉత్కంఠకు కొద్ది గంటల్లో తెరపడనుంది.
Andhra Pradesh Lok Sabha Election Results 2024 : అంతిమంగా ఏ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోనుందన్న అంశాన్ని ఓట్ల లెక్కింపు అనంతరం వెల్లడించనున్నారు. మరోవైపు ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా సాయుధ పారామిలటరీ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. కౌంటింగ్ కేంద్రాల పరిధిని ఎన్నికల కమిషన్ రెడ్ జోన్‌గా పరిగణించి 144 సెక్షన్ అమలు చేస్తోంది.
ఏపీలో మే 13న జరిగిన పోలింగ్‌లో మొత్తం 3.33 కోట్ల మంది ఓటు వేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న 4,61,945 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటును వినియోగించుకున్నారు. అలాగే హోమ్ ఓటింగ్ ద్వారా 26,473 మంది, సర్వీసు ఓటర్లు 26,721 మంది ఓటేశారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఈవీఎం లెక్కింపునకు 2443 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కోసం 443 టేబుళ్లను సిద్ధం చేశారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 2446 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 557 టేబుళ్లను లెక్కింపునకు ఏర్పాటు చేశారు.
Andhra Pradesh Assembly Results 2024 : ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా 13 రౌండ్లు ఉన్న నర్సాపురం, రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గాల ఫలితం ముందుగా వెలువడనుంది. అలాగే కొవ్వూరు, నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు మధ్యాహ్నం ఒంటిగంట కల్లా వెల్లడయ్యే అవకాశముంది. ఇక అమలాపురం పార్లమెంటు నియోజకవర్గం, భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు ఆఖరున వెల్లడయ్యే అవకాశముంది.
111 నియోజకవర్గాల ఫలితాలు మధ్యాహ్నం ఒంటి గంటకే వెలువడే అవకాశమున్నట్టు ఇప్పటికే ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం స్పష్టం చేస్తోంది. అలాగే 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్ల మధ్య ఫలితం వెల్లడయ్యే అవకాశముంది. 3 నియోజకవర్గాల్లో 25 రౌండ్ల తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 2 రౌండ్లలోపు 102 నియోజకవర్గాలు, 48 నియోజకవర్గాల్లో 3 రౌండ్లు, 25 నియోజకవర్గాల్లో 4 రౌండ్ల మేర కౌంటింగ్ ప్రక్రియ జరుగనుంది.
రెడ్ జోన్‌గా కౌంటింగ్ కేంద్రాలు : మొత్తం 119 మంది అబ్జర్వర్ల పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగనుంది. కౌంటింగ్ కేంద్రాలను రెడ్ జోన్‌గా ప్రకటించినట్టు ఈసీ స్పష్టం చేసింది. కౌంటింగ్ కేంద్రాల్లో ఎలాంటి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించినా తక్షణమే ఏజెంట్లను బయటకు పంపి కేసు నమోదు చేసి జైల్లో పెడతామని హెచ్చరికలు జారీ చేసింది. కౌంటింగ్ కేంద్రాల లోపల పూర్తి వీడియోగ్రఫీ చేయిస్తున్నట్టు తెలిపింది. కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లను అనుమతించబోమని ఈసీ వెల్లడించింది.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత :కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతుందని సీఈఓ ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్‌లు, డ్రోన్ల సాయంతో అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద భద్రతను పర్యవేక్షించనున్నట్టు తెలిపారు. పోలింగ్ రోజు, అనంతరం జరిగిన హింసాత్మక ఘటనల దృష్ట్యా అన్ని కౌంటింగ్ కేంద్రాలతో పాటు సున్నితమైన ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఏపీకి అదనంగా 67 కంపెనీల సాయుధ పోలీసు బలగాలను రప్పించి మొహరించినట్టు పేర్కొన్నారు. 45,000ల మంది రాష్ట్ర పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరక్కుండా విధుల్లో ఉన్నారని ముఖేశ్ కుమార్ మీనా వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 1985 సున్నితమైన ప్రాంతాల్లో పోలీసు పికెట్ ఏర్పాటు చేసినట్టు సీఈఓ ముఖేశ్ కుమార్ మీనా వెల్లడించారు. 83 అసెంబ్లీ నియోజకవర్గాల్లో హింస జరగొచ్చన్న సమాచారం మేరకు బందోబస్తు ఏర్పాట్లు చేశామని, 12639 మందిని బైండోవర్ చేసినట్టు తెలిపారు . అదనపు డీజీపీ స్థాయి నుంచి సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి వరకూ వేర్వేరు ప్రాంతాల్లో అధికారులను మొహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నట్టు స్పష్టం చేశారు. 26 జిల్లాల్లోనూ అన్ని చోట్లా కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి వాటి ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు ముకేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు.
అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చే కౌంటింగ్ ప్రక్రియ - ఎలా జరుగుతుందో మీకు తెలుసా? - Vote Counting Process in India
మోదీ 3.0 vs ఇండియా కూటమి- కౌంటింగ్‌కు అంతా రెడీ- నెహ్రూ రికార్డు సమం చేస్తారా? - lok sabha election results 2024