CM Revanth on RRR : ఆర్ఆర్ఆర్ కోసం భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. నాగ్‌పూర్-విజయవాడ కారిడార్ భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేయాలన్నారు. భూసేకరణకు సంబంధించి అటవీశాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నారు.
అటవీ, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. రెండు శాఖల్లో భూసేకరణకు ప్రత్యేక అధికారిని నియమించాలని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండేలా చర్యలు సీఎం ఆదేశాలిచ్చారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్డు వెడల్పుగా ఉండేలా డిజైన్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలకమైన సూచనలు చేశారు.
ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి రూ.7,104.06 కోట్లు : ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగానికి కేంద్రం ఐదు ప్యాకేజీల్లో పనులు చేపట్టడానికి టెండర్లను పిలిచింది. రెండేళ్లలో ఉత్తరభాగం పనులను పూర్తి చేయాలని కేంద్రం మెలిక పెట్టింది. దీన్ని కేంద్రం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా నిర్మించనుంది. ఈ రహదారి నాలుగు వరుసలుగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్‌హెచ్‌ఏఐ నిర్మించనుంది. ఆర్ఆర్‌ఆర్ నిర్మాణానికి రూ.7104.06 కోట్లను కేంద్రం మంజూరు చేసింది. కేవలం ఉత్తర భాగం పొడవు 161.518 కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
ఐదు ప్యాకేజీల్లో నిర్మాణ పనులు :
- మొదటి ప్యాకేజీ కింద సంగారెడ్డి జిల్లాలోని గిర్మాపూర్ నుంచి రెడ్డిపల్లి వరకు 34.518 కి.మీ. నిర్మాణానికి రూ.1,529.19 కోట్లు ఖర్చు చేయనున్నారు.
- రెండో ప్యాకేజీ రెడ్డిపల్లి గ్రామం నుంచి ఇస్లాంపూర్ గ్రామం వరకు 26 కి.మీ. నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం. ఇందుకు రూ.1,114.80 కోట్లు ఖర్చు చేయనున్నారు.
- మూడో ప్యాకేజీలో ఇస్లాంపూర్ గ్రామం నుంచి ప్రజ్ఞాపూర్ వరకు 23 కి.మీ. దీని నిర్మాణానికి రూ.1,184.81 కోట్లను ఖర్చు చేయనున్నారు.
- నాలుగో ప్యాకేజీ కింది ప్రజ్ఞాపూర్ నుంచి రాయగిరి వరకు 43 కి.మీలలో నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం. దీనికి రూ.1,728.22 కోట్లను ఖర్చు చేయనున్నారు.
- ఐదో ప్యాకేజీ కింద రాయగిరి నుంచి తంగడ్‌పల్లి గ్రామం వరకు 35 కి.మీ దూరంతో నాలుగు వరుసల గ్రీన్‌ఫీల్డ్ రహదారి నిర్మాణం. ఇందుకు రూ.1,547.04 కోట్లను ఖర్చు చేయనున్నారు.
11 ఇంటర్ ఛేంజ్‌లు : ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగంలో నిర్మించనున్న నాలుగు వరుసల రహదారికి 11 జాతీయ, రాష్ట్ర రహదారులను అనుసంధానించనున్నారు. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వేగా దీనిని అనుసంధానంగా ఉండే మార్గాల ద్వారా హైదరాబాద్‌తో పాటు నగర శివారులోకి కూడా వెళ్లకుండానే నేరుగా ఇతర రాష్ట్రాలకు ప్రయాణం చేయవచ్చు. అంతే కాకుండా ఇతర జిల్లాలకు నేరుగా వెళ్లవచ్చు. దీనివల్ల సమయం, ఖర్చులు ఆదా అవుతాయి.
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి టెండర్లు పిలిచిన కేంద్రం - ఆ కండీషన్ మాత్రం తప్పనిసరి