Heavy Betting On AP Election Results 2024 :దేశంలో ఓ పక్క ఐపీఎల్ బెట్టింగులు జరుగుతుంటే మరోపక్క ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు గెలుస్తారనే అంశాలపై పందేలు కాస్తున్నారు. ఎన్నికల ఫలితాలకు మరో 17 రోజుల గడువు ఉండటంపై ఎవరికి వారే అంచనాలు వేసుకుని పందేల్లో మునిగితేలుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సరళిని అంచనావేస్తూ పందేలు రూ.లక్షల్లో కాస్తున్నారు.
Analysis On AP Elections 2024 Results :అమలాపురంలో అసెంబ్లీ నుంచి కూటమి అభ్యర్థి గెలుపు ఖాయమని ప్రత్యర్థి పక్షాలే చెబుతున్నాయంట. గతంలో జరిగిన పరిణామాలు ప్రభావం చూపుతాయట కదా, అందుకే అధికార పార్టీవారు పందేలకు వెనకడుగు వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అమలాపురం పార్లమెంట్ కూటమి అభ్యర్థికి లక్ష పైచిలుకు ఓట్ల మెజార్టీ వస్తుందంటున్నారు. పోటీ అభ్యర్థి ప్రచార జాడ పల్లెల్లో లేకపోవటంతో అధికార పార్టీ ఓట్లు కూడా కూటమికే పడ్డాయంటున్నారు. రైలు కూత వినేందుకైనా ఈసారి కూటమికే ఓటేశామని అధికార పార్టీ కార్యకర్తలే చెబున్నారట కదా ఇదీ కోనసీమ, ఉభయ గోదావరిలో నడుస్తున్న చర్చ.
కొత్తపేటలో ఎన్నికల ముందు వరకు ఉప్పునిప్పులా ఉన్న అన్నదమ్ములిద్దరూ కలిసిపోయారని గెలుపు ఈ సారి వారిదేనని చెబుతున్నారు. ముమ్మిడివరంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి 10 వేలకుపైగానే మెజార్టీ వస్తోందంటున్నారు. పి.గన్నవరంలో మెజార్టీపైనే పందేలు వేసుకునే పరిస్థితి ఉందంటున్నారు. రాజోలులో ఓ పార్టీ అభ్యర్థి గెలుపు గురించి, సీనియర్ అయిన మరో అభ్యర్థి ప్రభావంపై చర్చ నడుస్తోంది. గత ఎన్నికల్లో జనసేన ఇక్కడే గెలవడంతో ఈ సారి పరిస్థితిపై లెక్కలు వేసుకుంటున్నారు. రామచంద్రపురంలో కాసింత గట్టిపోటీ ఉందనే అంటున్నారు. మండపేట కూటమిదేనని ఇటీవల కొన్ని పరిణామాలు ప్రత్యర్థిని వెనక్కి నెట్టేశాయని పేర్కొంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ యుగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా పందేలు సాగుతున్నాయి.